రక్తపు మడుగులో బాధితురాలు మాధవి
హైదరాబాద్: మిర్యాలగూడలో చోటు చేసుకున్న ప్రణయ్ పరువు హత్యను మరువక ముందే హైదరాబాద్‌లో మరో ఉదంతం వెలుగు చూసింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై కత్తిగట్టాడో తండ్రి. వారి వివాహాన్ని అంగీకరించినట్లు నమ్మిస్తూనే దాడికి పాల్పడ్డాడు. వస్త్రాలు ఖరీదు చేయడానికంటూ కూతురు, అల్లుడిని పిలిచి నడిరోడ్డుపైనే హత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన కుమార్తెపై విచక్షణారహితంగా కత్తి విసిరాడు. అల్లుడికి స్వల్పగాయాలు కాగా... కుమార్తె మాత్రం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ జంటకు గత బుధవారమే వివాహం కాగా.. ఈ బుధవారం దారుణం జరిగింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
12న ఆర్యసమాజ్‌లో పెళ్లి...
ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్ (24), బోరబండ వినాయకరావునగర్‌కు చెందిన మాధవి (22)కి నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. డిగ్రీ వరకు చదివిన సందీప్ ప్రస్తుతం మోతీనగర్‌లోని రాయుడు బిర్యాని హోటల్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తుండగా, మాధవి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తొలుత వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని భావించారు. సందీప్ దళిత వర్గానికి, మాధవి విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన వారు కావడం పెళ్లికి అడ్డంకిగా మారింది. వీరి వివాహానికి సందీప్ కుటుంబ సభ్యులు అంగీకరించినా... మాధవి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కులమే కాక మాధవిని తన సమీప బంధువుకు ఇవ్వాలని ఆమె కుటుంబీకులు భావించడం దీనికి కారణం. దీంతో పెద్దలను ఎదిరించి ఈ నెల 12న అల్వాల్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి రక్షణ కల్పించాలని కోరారు. ఇరువురు మేజర్లు కావడంతో పోలీసులు వారి కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాధవి తండ్రి మనోహరచారి సైతం వివాహం విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వెళ్లిపోయాడు.
వస్త్రాలు కొందామని చెప్పి...
నవదంపతులు ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌లోని సందీప్ ఇంట్లో కాపురం పెట్టారు. ఆపై ఇరు కుటుంబాల వారూ రాకపోకలు కూడా సాగించారు. ఈ ఆదివారం జరుగనున్న వినాయక నిమజ్జనం తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేస్తానంటూ మనోహరచారి అల్లుడు, కుమార్తెను నమ్మించాడు. తన కుమార్తె వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని భావించిన అతను అల్లుడిపై కక్షకట్టాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కుమార్తెకు ఫోన్ చేశాడు. రిసెప్షన్‌కు వస్త్రాలు ఖరీదు చేయాలని, మధ్యాహ్నం ఎర్రగడ్డకు రావాలని సూచించాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై ఎర్రగడ్డకు వచ్చారు.
గోకుల్ థియేటర్ సమీపంలో వేచి చూస్తుండగా 3.45కు మనోహరచారి బైక్‌పై వచ్చాడు. వారితో మాట్లాడుతూనే బొండాలు నరికే కత్తిని బ్యాగ్‌లోంచి తీసి సందీప్ మెడపై నరికాడు. దీంతో ఇరువురూ షాక్ తిన్నారు. మాధవి తేరుకుని అడ్డుపడే ప్రయత్నం చేయడంతో ఆమె ఎడమ చేతిపై వేటు పడింది. అయినా తండ్రిని వారిస్తూ లాగడంతో కింద పడిపోయారు. దీంతో విచక్షణ కోల్పోయిన మనోహరచారి కుమార్తెపై మరో మూడు వేట్లు వేశాడు. ఈలోపు సందీప్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు చారిని ఆపే ప్రయత్నం చేసినా కత్తి చూపిస్తూ బెదిరించాడు. ఓ యువకుడు వెనుక నుంచి వచ్చి బలంగా తన్నినా ఫలితం లేకుండాపోయింది. కొద్దిసేపటి తర్వాత వాహనాన్ని వదిలి పారిపోయాడు.
మాధవి పరిస్థితి విషమం...
తీవ్ర గాయాలైన మాధవి, సందీప్‌ను స్థానికులు సనత్‌నగర్‌లోని నీలిమా ఆసుపత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ వై.వెంకటేశ్వరరావు పరిశీలించారు. సందీప్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మనోహరచారి ఎంఎస్ మక్తాలోని తన బంధువు ఇంట్లో దాక్కున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గురువారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు. దాడికి వినియోగించిన కత్తిని ఎర్రగడ్డ ప్రాంతంలోని ఓ కొబ్బరిబొండాల వ్యాపారి నుంచి తస్కరించి తెచ్చినట్లు తెలిసింది. చికిత్స పొందుతున్న మాధవి (22) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. శస్త్ర చికిత్స పూర్తయితే గానీ పరిస్థితి చెప్పలేమని స్పష్టం చేశారు. సందీప్ పరిస్థితి నిలకడగా ఉంది.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
తాగిన మైకంలోనే దాడి...
పోలీసుల కౌన్సిలింగ్ తరువాత మనోహరచారి మూడుసార్లు అల్లుడి ఇంటికి వెళ్లి కుమార్తెతో మాట్లాడి వచ్చాడు. బుధవారం పథకం ప్రకారమే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాగిన మైకంలో క్షణికావేశంలో ఈ ఘోరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు ఎస్సార్‌నగర్‌లోని ఓ జ్యువెలరీ దుకాణంలో ఆభరణాలు మెరుగుపెట్టే పని చేస్తుంటాడు. సందీప్ తండ్రి చనిపోగా, తల్లి మాత్రమే ఉంది. వీరి కుటుంబం ఆర్థికంగా కొంత స్థిరపడింది.
– వై.వెంకటేశ్వరరావు, ఎస్సార్‌నగర్ ఇన్‌స్పెక్టర్
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
కుమార్తెపై దాడికే వచ్చాడు...
అరెస్టు చేసే సమయానికి నిందితుడు తాగిన మైకంలో ఉన్నాడు. బ్రీత్ ఎనలైజర్‌లో పరీక్షిస్తే బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 370 వచ్చింది. కేవలం తన కుమార్తెపై దాడి చేయడానికే వచ్చానని విచారణలో పేర్కొన్నాడు. బుధవారం ఉదయం ఫోన్ చేసినప్పుడు కూడా కుమార్తెను మాత్రమే రమ్మన్నానని చెప్పాడు. తన భార్య, కుమారుడు కలసి కుమార్తెకు వివాహం చేశారని వెల్లడించాడు. తనకు ఇష్టం లేదని, కూతురిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
– ఏఆర్ శ్రీనివాస్, వెస్ట్‌జోన్ డీసీపీ
–––––––––––––––––––––––––––––––––––––––––
Comments
Please login to add a commentAdd a comment