కాంగ్రెస్ పాలన...చంద్రబాబు కుట్ర వల్లే...
కరెంటు కష్టాలు
గజ్వేల్: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పాలన, టీడీపీ అధ్యక్షుడు కుట్రేకారణమని నీటి పారుదల శాఖామాత్యులు హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని వైష్ణవీ గార్డెన్స్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేడు కరెంట్ సరఫరా సక్రమంగా లేదంటూ విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు... కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా పనిచేసిన కాలంలో దక్షిణ గ్రిడ్ నుంచి 2వేల మెగావాట్ల విద్యుత్‌ను తెప్పించే ప్రయత్నం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు ఆంధ్ర, రాయలసీమలోని థర్మల్ ప్లాంట్‌లకు తరలివెళ్తుంటే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్ వాటాను రాకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. లోయర్ సీలేరు వద్ద నుంచి తెలంగాణకు 52 శాతం విద్యుత్ వాటా రావాల్సి ఉండగా అది చంద్రబాబు కుట్రవల్లే రావడం లేదన్నారు. కరెంట్ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి టీఆర్‌ఎస్ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీశ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈనెల 11న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ప్లీనరీ, 12న సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో బహిరంగ సభ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఈనెల 8న నియోజకవర్గ స్థాయిలో, 9న మండల స్థాయిలో పార్టీ సమావేశాలను నిర్వహించుకోవాలని సూచించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు.
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, బాబూమోహన్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి రాజయ్యయాదవ్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ నగర పం చాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఎ మ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జి ల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ సభలో ఎంపీటీసీ సభ్యుడి ఆత్మహత్యాయత్నం
పోలీసులు వేధిస్తున్నారని.. ఒంటిపై పెట్రోల్ చల్లుకోవడంతో కలకలం
గజ్వేల్: జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఒక కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేసిన సంఘటనకు తనను బాధ్యునిగా చిత్రీకరిస్తూ పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జగదేవ్‌పూర్ ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్ ఒంటిపై పెట్రోల్ చల్లుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌రావు ప్రసంగిస్తుండగా అనూహ్యంగా ఈ సంఘటన చోటుచేసుకోవడంతో పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఇటిక్యాల గ్రామానికే చెందిన భాస్కర్... గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పుతో తనకు ఏ సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఆయన ఈ ఘటనకు పాల్పడ్డారు. పక్కనున్న కార్యకర్తలు, నాయకులు అతణ్ని వారించి, సమావేశ మందిరం నుంచి పక్కకు తీసుకెళ్లారు. అప్పటికే మంత్రి ప్రసంగం చివరి దశకు చేరడంతో సంఘటన అనంతరం మరికొంతసేపు మాట్లాడి ముగించారు. కొందరు నాయకులు ఎంపీటీసీ భాస్కర్‌ను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి అతని సమస్యను వివరించారు. డిప్యూటీ స్పీకర్ అతణ్ని సముదాయించే ప్రయత్నం చేశారు.