డాంబర్.. యమ డేంజర్ | Dambar very Danger for Air Pollution | Sakshi
Sakshi News home page

డాంబర్.. యమ డేంజర్

Published Mon, Oct 12 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

డాంబర్.. యమ డేంజర్

డాంబర్.. యమ డేంజర్

పుల్‌కల్: ఒకప్పుడు పచ్చని పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో గడిపిన ఆ రెండు ప్రాంతాలు నేడు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కరువై మంచం పట్టాయి. శివ్వంపేటలోని వడ్డెరబస్తీ, కొత్తగడ్డ ప్రాంతాలు అనారోగ్యం, అస్వస్థతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రతి ఇంటా ఒకరు ఆస్పత్రుల పాలవుతున్నారు. జనావాసాల మధ్యలో అనుమతి లేకుండా నడుపుతున్న డాంబర్ మిల్లు ఈ పరిస్థితికి కారణమవుతోంది.
 
ఈ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం ఘాటుకు పలువురు మహిళలు గర్భం సైతం కోల్పోతున్నారు. గర్భం దాల్చిన కొందరు మహిళలైతే ప్రసవమయ్యేంత వరకు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని పుల్‌కల్ మండలం శివ్వంపేటలో అనుమతి లేకుండా డాంబర్ మిల్లు నడుస్తోంది. జనావాసాల మధ్యలో ఉన్న ఈ పరిశ్రమ తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతోంది. డాంబర్‌ను మరగబెట్టే క్రమంలో విపరీతమైన వాసన వస్తోంది.

ఈ గాలి పీల్చిన వారు వాంతులు, ఆయాసానికి గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ కాసేపు సేద దీరేందుకు ఆరుబయటకు వస్తే వాసన కారణంగా తల తిరగడం, వాంతులు, దమ్ము వస్తున్నాయని కాలనీవాసులు అంటున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు ఆయాసంతో ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు. పొగ, ఊపిరిసలపనివ్వని వాసనతో కడుపులో నొప్పి రావడంతో పాటు గర్భిణిలకు పెనుముప్పు వాటిల్లుతోంది. కొందరు గర్భం పోగొట్టుకున్న దాఖలాలున్నాయి. డాంబర్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వాసన, పొగలే ఇందుకు కారణమని గైనకాలజిస్టులు సైతం ధ్రువీకరిస్తున్నారు.
 
జాడ లేని పీసీబీ అధికారులు
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న డాంబర్ మిల్లు వైపు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. పరిశ్రమ ద్వారా వచ్చే వాయు కాలుష్యంతో పలువురు రోగాల బారిన పడుతున్నారని ఫిర్యాదులందినా చర్యల్లేవు. పరిశ్రమ ఏర్పాటుకు ఒక్క అనుమతీ నిబంధనల ప్రకారం పొందలేదని, రెవెన్యూ, విద్యుత్, పీసీబీ, పబ్లిక్ హెల్త్ అధికారులు ముడుపులు తీసుకుని పరిశ్రమ ఏర్పాటుకు అనుమతినిచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
 
అన్నీ అక్రమమే..
నిబంధనల ప్రకారం చిన్నతరహా పరిశ్రమను ఏరా్పాటు చేయాలన్నా తొలుత ప్రజాభిప్రాయం తీసుకోవాలి. అంతకంటే ముందు పరిశ్రమను స్థాపించే వ్యవసాయ భూమిని మార్పిడి చేయించుకోవాలి. ఇందుకు తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆయన డివిజనల్ రెవెన్యూ అధికారికి ప్రతిపాదిస్తారు.

ఆయన అంగీకరిస్తేనే వ్యవసాయ భూమిని పరిశ్రమ ఏర్పాటుకు వీలుగా మార్చుకొనే అవకాశం కలుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వానికి మార్కెట్ వాల్యూ ప్రకారం టాక్స్ చెల్లించాలి. కాని శివ్వంపేటలో ఏర్పాటు చేసిన డాంబర్ మిల్లు యాజమాని ఇవేమీ లేకుండానే రెండేళ్ల క్రితం దర్జాగా పరిశ్రమను ఏర్పాటు చేశారు. దీన్ని మరో పది ఎకరాల్లో విస్తరించేందుకు పనులు ప్రారంభించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement