
టీఆర్‌ఎస్ సినిమా కొన్నిరోజులే..
జోగిపేట: ‘ఎన్నికల సమయంలో అది చేస్తాం.. ఇది చేస్తాం అని ప్రజలను మాటలతో మభ్యపెట్టి ఓట్లు దండుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.. టీఆర్‌ఎస్ సినిమా ఇక కొన్నిరోజులే’ అని మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ మండిపడ్డారు. శనివారం మెదక్ జిల్లా అందోల్ మండలం తాడ్మన్నూర్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా ఏ పనులూ చేయలేదని, మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి.. నిలుపుకొనే పార్టీ అనీ, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను గ్రామ పెద్దలు, ప్రజలు దామోదర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు ప్రభుత్వానికి బానిసలుగా మారొద్దని సూచించారు.
జిల్లాలో ఐఏఎస్ అధికారుల నుంచి కిందిస్థాయి అధికారులను ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అక్రమంగా కేసులు పెట్టొద్దు.. ఇది మంచి సంస్కృతికాదని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ప్రజల సమస్యలను పరిష్కరించడం అధికారుల బాధ్యతన్నారు.