
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టారని, మెరుగైన రవాణా సౌకర్యం కోసం మెట్రో రైలు తీసుకొచ్చారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. వేగవంతమైన ప్రయాణం, తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగాలన్నదే మెట్రో లక్ష్యమని, మెట్రో చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వీటితో పేద ప్రజలు, చిరు వ్యాపారం చేసేవాళ్లు, సగటు ఉద్యోగి ప్రయాణించలేరన్నారు. గాంధీ భవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీలో మెట్రో రైలు చార్జీలు పెంచడంతో మూడున్నర లక్షల మంది ప్రయాణికులు దూరమయ్యారని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది పేదలే కాబట్టి, వెంటనే మెట్రో ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మెట్రో ధరలపై కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు. మెట్రో ఆలస్యానికి కారణం టీఆర్‌ఎస్ పార్టీ అని, రూ. 4 వేల కోట్ల భారం పెరిగేందుకు కారణమైందని ఆరోపించారు. పెరిగిన వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని, ప్రజలపై భారం వేయొద్దని సూచించారు.
మొత్తం రూ.14 వేల కోట్లలో టీఆర్‌ఎస్ సర్కార్ మూడేళ్లలో మెట్రోకు కేటాయించింది రూ.370 కోట్లు మాత్రమేనన్నారు. మిగిలిన నిధులు కాంగ్రెస్ హయాంలోనే విడుదల చేశారని పేర్కొన్నారు. మెట్రో ప్రారంభానికి బీజేపీ నాయకులను ప్రధాని మోదీ పక్కన కూర్చోబెట్టారని, కానీ, మేయర్ పేరు మాత్రం శిలఫలకంపై కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. మంత్రివర్గంలో మహిళలు లేకుండా ప్రభుత్వాన్ని మూడేళ్లు నడిపిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment