సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై అరెస్టు చేసిన సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రమణకుమార్ తెలిపారు. అనంతరం ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమాస్తులు కూడబెట్టాడనే ఆరోపణలపై బుధ, గురువారాల్లో సిద్దిపేటలోని నర్సింహారెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, జహీరాబాద్, షాద్‌నగర్, అయ్యవారిపల్లె, అతని బంధువులు, ఇతర అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక నర్సింహారెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు.
అతని నివాసంతోపాటు బంధువుల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో 1.5 కేజీల బంగారం, రూ.5.33 లక్షల నగదు, రూ.6.37 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, గోల్కొండ వద్ద ఒక విల్లా, రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి, గొల్లపల్లిలో 14 ప్లాట్లు, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 20 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.5.02 కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ ప్రకారం రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించడంతో నర్సింహారెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
తాండూరులోనూ ఆస్తులు?
నర్సింహారెడ్డికి వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోనూ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు మండలంలోని ఓగిపూర్‌లో విలువైన నాపరాతి గనులు ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన పేరుతో కాకుండా బినామీ పేర్లపై ఈ గనులు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment