మధుకర్ ‘మర్డర్’ మిస్టరీ!
♦ హత్యా.. ఆత్మహత్యా..?
♦ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం
♦ ప్రేమ వ్యవహారమే కారణమా?
♦ యువతి బంధువులే చంపేశారా?
♦ అమ్మాయి నోరు విప్పితేనే గుట్టు వీడేది
♦ దళిత, ప్రజాసంఘాల ఆందోళన బాట
సాక్షి, పెద్దపల్లి/హైదరాబాద్/న్యూఢిల్లీ: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతి కలకలం రేపుతోంది. ఘటన జరిగిన 20 రోజుల తర్వాత సోషల్ మీడియాలో దీనిపై సాగుతున్న విస్తృత ప్రచారం అటు పోలీసు శాఖలో, ఇటు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మధుకర్‌ది అనుమానాస్పద మృతి అని పోలీసులు చెబుతున్నా.. అందుకు విరుద్ధంగా ప్రచారం జరుగుతోంది. ప్రేమ వ్యవహారం కారణం గానే మధుకర్‌ను హత్య చేశార ని, కళ్లు పీకి.. మర్మాంగాలు కోసి చంపే శారని, ఇందులో మంథని నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. మంథనిలో ఆదివారం సుమారు 48 దళిత సంఘాలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అసలేం జరిగింది?
మధుకర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఖానాపూర్ పొరుగునే ఉన్న వెంకటాపూర్‌కు చెందిన ఓ యువతి, మధుకర్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయమై సదరు యువతి కుటుంబ సభ్యు లు, బంధువులు మధుకర్‌ను పిలిచి బెదిరిం చినట్లు తెలుస్తోంది. గతనెల 13న ఇంటి నుంచి వెళ్లిన మధుకర్ మరుసటి రోజు ఖానాపూర్ శివారులో శవమై కనిపించాడు.
పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ట్లు కనిపించినా.. ముళ్ల కంపలో మృతదేహం పడి ఉండడంతో ఇక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడనే అను మానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయించి, మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అయితే మధుకర్‌ను హత్య చేశారంటూ 15న కుటుంబసభ్యులు, బంధువులు మంథనిలో రాస్తారోకో చేశారు. మృతిపై దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరిపారు.
ఇద్దరూ కలిసే ఆత్మహత్యాయత్నం?
మధుకర్, సదరు యువతి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి వెంకటాపూర్ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన యువతి కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ యువతే.. నర్సు సెల్ నుంచి ఫోన్ చేసి చెప్పడంతో వెళ్లి చూడగా మధుకర్ మృత దేహం దొరికిందని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో ఇద్దరూ కలసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనేందుకు బలం చేకూరుతోంది.
కానీ వెంకటాపూర్ నుంచి ఖానాపూర్‌కు మధుకర్ శవం ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారింది. మధుకర్ మృతిపై విచారణాధికారిగా పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మను నియమించారు. సోమవారం నుంచి ఆమె దర్యాప్తు ప్రారంభించనున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఆత్మహత్య చేసుకున్నట్టే తేలిందని, ఎపిడమిక్ సెల్ రిపోర్టు కోసం వేచి చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న యువతి నోరు తెరిస్తేనే అసలేం జరిగిందో వెల్లడికానుంది.
దళిత సంఘాల రాస్తారోకో
మధుకర్‌ది హత్యేనంటూ తెలంగాణ, ఏపీకి చెందిన 48 దళిత, ప్రజా సంఘాలు ఆదివా రం మంథనిలో ఆందోళనకు దిగాయి. ఎమ్మార్పీఎస్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో మధుకర్ తల్లిదండ్రులు లక్ష్మి–ఎల్లయ్యను కలిసి సంఘాల ప్రతిని ధులు వివరాలు సేకరించారు. అంబేడ్కర్ చౌక్ వెళ్లి బైఠాయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు చించి, పార్టీ జెం డాలను తగలబెట్టారు.
నిరసనలో తెలం గాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్.రమేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, ప్రజా ఫ్రంట్ నేత గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ సురెపల్లి సుజాత, కదిరె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం జరిపించాలని ఇన్నయ్య, చెరు కు సుధాకర్ అన్నారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతోపాటు సీఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మందకృష్ణ మాదిగ
మధుకర్ హత్యపై సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు బంధువుల అమ్మాయిని ప్రేమించిన కారణంగా మధుకర్‌ను హత్య చేయించారని ఆదివారం ఢిల్లీలో ఆయన ఆరోపించారు.
రీ పోస్టుమార్టం చేయాలి: వీహెచ్
మధుకర్ మృతదేహానికి మూడు రోజుల్లో రీ పోస్టుమార్టం నిర్వహిం చాలని, లేకుంటే హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద దళిత సంఘాలతో కలిసి ధర్నా నిర్వహిస్తానని మాజీ ఎంపీ వి.హనుమంతరావు హెచ్చరించారు. మంథనిలో ఆయన మధుకర్ తల్లిదండ్రులను కలిశారు.
విచారణ చేయాలి: చాడ
మధుకర్ మృతిపై న్యాయ విచారణ చేయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అతడి మృతి వెనుక అధికార పార్టీకి చెందిన కొందరి హస్తం ఉందని, ప్రేమ వ్యవహారంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు.