స్థానిక సంస్థల ఆడిటింగ్ లో లోపాలు
ప్రజా పద్దుల సంఘం భేటీలో చర్చ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఆడిటింగ్‌లో లోపాలున్నాయని, వాటిని తమ పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) నిర్ణయించింది. తెలంగాణ పీఏసీ చైర్‌పర్సన్‌గా జె.గీతారెడ్డి ఎన్నికైన తర్వాత తొలి సమావేశం అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో శనివారం జరిగింది. గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి.. గీతారెడ్డిని అభినందించారు. స్థానిక సంస్థల్లో ఆడిటింగ్ జరుగుతున్న విధానం, రెవెన్యూ విభాగాన్ని 1971 నుంచి పీఏసీ సమీక్షించకపోవడంపై చర్చించారు.
నగర, పట్టణ పాలక సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో ఆడిటింగ్ జరుగుతున్న విధానంలో చాలా లోపాలున్నాయన్నారు. వీటిని పీఏసీ పరిధిలోకి తీసుకురావాలని, సమగ్ర సమాచారంతో చర్చించాలని నిర్ణయించారు. దీంతో పాటు రెవెన్యూ విభాగంపైనా దృష్టి సారించాలని నిర్ణయించారు. మిగిలిన అన్ని విభాగాలు కూడా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మే 9న పీఏసీ తదుపరి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు టి.జీవన్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, గువ్వల బాలరాజు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, రాములు నాయక్, భానుప్రసాద్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.