16 లోపు పంట రుణాల మాఫీ
వడూర్(నేరడిగొండ) : ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చుతుందని, ముఖ్యంగా రైతుల రుణమాఫీ ఈ నెల 16వ తేదీలోపు పూర్తిచేస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వడూర్ గ్రామంలో 33/11 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి జోగు రామన్న శంకుస్థాపన చేశారు. అనంతరం వడూర్ సర్పంచ్ అంబేకరి శోభారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలోమాట్లాడారు.
60 ఏళ్ల పోరాటాల అనంతరం తెలంగాణ రాష్ట్రం రావడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, తొలిసారిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన రుణ మాఫీ హామీని నెరవేరుస్తామని, 16న క్యాబినెట్ సమావేశంలో పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. ఈ ఖరీఫ్‌లో వర్షాల జాడ లేకపోవడంతో ప్రత్యామ్నయంగా పంటలను పండించేందుకు, రైతులకు అండగా ఉండేందుకు అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేశామని మంత్రి చెప్పారు.
నమ్మకాన్ని వమ్ము చేయం
తెలంగాణ ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తమ ప్రభుత్వం ప్రవేశపెట్టినందున అందరూ దీనికి సహకరించాలని కోరారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిశీలించి సకాలంలో పరిష్కరిస్తామన్నారు.
వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా వైద్యశాఖ, పంచాయితీ అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుందని తెలిపారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జెడ్పీటీసీ సయ్యద్ యాస్మిన్, ఎంపీటీసీ ఉప్పు పోశెట్టి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గాదె శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు మంత్రి రామన్నను, ఎంపీ నగేశ్‌ను, ఎమ్మెల్యే బాపురావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.