డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీ
కూసుమంచి: ఉప ముఖ్యమంత్రి, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య కూసుమంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ ఇక్కడ ఆగారు. ఆస్పత్రిలోకి డిప్యూటీ సీఎం ఒక్కసారిగా రావడంతో సిబ్బంది హడలెత్తిపోయారు. ఉరుకులు, పరుగులు పెట్టారు. రాజయ్య నేరుగా మెడికల్ ఆఫీసర్ గదిలోకి వెళ్లి ఓపీ రిజస్టర్లు, ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ శంకర్‌కుమార్ ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో నిల్వ ఉంచిన కుక్కకాటు, పాముకాటు మందులను తెప్పించి పరిశీలించారు.
ఈ మందులను ఎల్లప్పుడు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ల్యాబ్ రూమ్‌ను పరిశీలించారు. ఇదే ఆస్పత్రి ఆవరణలో ఉన్న హోమియో ఆస్పత్రిని కూడా సందర్శించారు. ఆస్పత్రికి కొత్త భవనం కావాలని వైద్యాధికారి నర్సింహరాజు కోరడంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం వచ్చిన సమయంలో కొందరు పేషంట్లు ఆస్పత్రిలోనే ఉన్నారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఉమా మహేష్ అనే బాలుడిని ఆయన స్వయంగా పరీక్షించి, మందులు రాసి ఇచ్చారు. నువ్వు కూడా నాలా డాక్టర్ కావాలంటూ ఆ బాలుడిని దీవించారు. ఆస్పత్రికి వచ్చిన వృద్ధురాలను పలుకరిస్తూ పింఛన్ వస్తోందా అని అడిగి తెలుసుకున్నారు.
పీహెచ్‌సీ స్థాయిని పెంచాలి
నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచిలోని పీహెచ్‌సీ స్థాయిని పెంచాలని స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు కొత్తపల్లి సరిత, బారి వీరభద్రం, మాదాసు ఉపేందర్, రంజాన్ తదితరులు డిప్యూటీ సీఎం రాజయ్యను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. నాయకులు కూడా ఆస్పత్రుల అభివృద్ధికి సహకరించాలని రాజయ్య సూచించారు. ఆస్పత్రి నిర్వహణ సరిగా లేదని, డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని కూసుమంచికి చెందిన బారి వీరభద్రం ఫిర్యాదు చేయగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం చేసే వారిని సహించేది లేదన్నారు. ఆస్పత్రి తెరవకపోతే తనకు ఎవరైనా నేరుగా ఫోన్ చేయొచ్చని సూచించారు.