- విద్యార్థులను ఫెయిల్ చేయడంపై విద్యావేత్తల స్పష్టీకరణ
- ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీవోలతో విద్యాశాఖ సమావేశం
- నాన్ డిటెన్షన్ కొనసాగించాల్సిందేనని ఏకాభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఆధారిత దేశంలో డిటెన్షన్ విధానం సరైంది కాదని, నాన్ డిటెన్షన్‌ను కొనసాగించాల్సిందేన ని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, సంఘాల నేతలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఉపాధ్యాయులతో మంగళవారం విద్యాశాఖ ‘డిటెన్షన్-నాన్ డిటెన్షన్ విధానం’పై సమావేశం నిర్వహించింది. పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు నాన్ డిటెన్షన్‌ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. డిటెన్షన్ విధానం తెస్తే ఫెయిల్ అయిన విద్యార్థులంతా బాల కార్మికులుగా మారిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం డిటెన్షన్ చర్చే అవసరం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంలో డిటెన్షన్ విధానం తెచ్చి వారిని మళ్లీ బడికి దూరం చేయడం సరైంది కాదని స్పష్టం చేశాయి. పీఆర్టీయూ-టీఎస్‌తోపాటు మరోరెండు ఉపాధ్యాయ సంఘాలు మాత్రం 5, 7 తరగతుల్లో డిటెన్షన్ విధానం అ మల్లోకి తేవాలని పేర్కొన్నాయి.
తరగతి వారీగా సామర్థ్యాలను నిర్దేశించుకోవాలి: చుక్కా రామయ్య
విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కర ణలు తేవడం లేదని, తరగతి వారీగా సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధేశించుకోకుండా నిరుపేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్సీ, బీసీ విద్యార్థులను బడులకు దూరం చేయడం తగదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. ఏయే తరగతి విద్యార్థికి నేర్పించాల్సిన లక్ష్యాలపై స్పష్టమైన విధానంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను ఫెయిల్ చేసే విధానం వల్ల విద్యార్థులు తాము నేర్చుకునే కొద్దిపాటి విద్యకు, బడులకు పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యా ప్రమాణాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు.
సమావేశంలో పాఠశాల విద్య అదనపు డెరైక్టర్లు గోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, శేషుకుమారి, ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్ జగన్నాథరెడ్డి, విద్యా సంస్కరణల కన్సల్టెంట్ ఉపేందర్‌రెడ్డి, ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర ప్రతినిధి బుర్రా సునీత, పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, ర వి, పీఆర్‌టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి వెంకట్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.