- నీట మునిగిన పొలాలు
- ఆందోళనలో రైతులు
హసన్‌పర్తి : దేవాదుల పైపులైన్ ముచ్చర్ల-పెంబర్తి గ్రామాల మధ్య శుక్రవారం సాయంత్రం లీక్ అయింది. దీంతో నీరంతా ఎగసిపడుతోంది. గేట్‌వాల్వ్ ఒక్కసారిగా ఎగిరిపడడం వల్ల నీరు పైకి చిమ్ముతున్నట్లు రైతులు గుర్తించారు. అయితే గేట్‌వాల్వ్‌కు ఇరవై మీటర్ల దూరంలోనే పైపులైన్ లీకేజీ అయినట్లు తెలిపారు. తొలుత ఇరవై మీటర్ల ఎత్తు నుంచి అరవై మీటర్ల ఎత్తు వరకు నీరు ఎగసిపడింది.
విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. కాగా, లీక్ అయిన నీటి ప్రవాహానికి సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. చుట్టుపక్కల సుమారు పది ఎకరాల మేరకు పొలాల్లోకి నీరు చేరింది. దీంతో దేవాదుల వద్ద మోటార్ ఆఫ్ చేయాలని రైతులు మొరపెట్టుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా నీటి ప్రవాహం ఆగకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
నాసిరకం పనులు.. నాలుగేళ్లకే లీకేజీలు
దేవాదుల పైపులైన్ నిర్మాణ పనుల్లో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. ముచ్చర్లలో పైపులైన్ లీకేజీయే ఇందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. అయితే పైపులైన్లు లీకేజీ కావడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం సి ద్ధాపురం సమీపంలో పైపులైన్ లీకేజీ అయింది. నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల లీకేజీలు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు దే వాదుల ప్రాజెక్టు మొదటి దశకు సుమారు రూ.1800 కోట్లు, రెండో దశకు రూ.1500కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. దేవాదుల నుంచి ధర్మసాగర్ వరకు సుమారు 4లక్షల పైపులు ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు పే ర్కొన్నాయి. ఒక్కో పైపు కోసం రకాలవారీగా రూ.80 వేల నుంచి రూ.1.30లక్షల వరకు ఖర్చు చేశారు.
హైడ్రాలిక్ పరీక్షలపై అనుమానాలు
పైపులైన్లు అతికే సమయంలో హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల లీకేజీలు ఏర్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిష్ణాతుడైన ఇంజనీర్ సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించాలి. పరీక్ష చేయడానికి ఒక్కో పైపుకు కనీసం రూ.40వేల నుంచి రూ.50వేల వరకు ఖ ర్చవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనినిబట్టి హైడ్రాలిక్ పరీక్షలు ఎక్కడా నిర్వహించలేదని స్పష్టమవుతోంది. అయితే హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించకుండానే.. చేసినట్లు బిల్లులు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, క్వాలిటీ కంట్రోల్ అధికారులు సైతం తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకసారి హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించి మరమ్మతులు చేస్తే శాశ్వతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.