సాక్షి, వరంగల్ రూరల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాలు ఏర్పడిన నాటి నుంచి విభిన్నమైన రాజకీయ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. 1952 నుంచి 2009 వరకు పలుమార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 1952లో శాసనసభకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్ యతిరాజారావు ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి జెన్నారెడ్డి జనార్దన్‌రెడ్డి, డోర్నకల్ నుంచి ధరంసోత్ రెడ్యానాయక్, నర్సంపేట నుంచి మద్దికాయల ఓంకార్, వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు వీరంతా ఐదుసార్లు విజయం సాధించారు. డోర్నకల్ నుంచి నూకల రామచంద్రారెడ్డి, రామసహాయం సురేందర్ రెడ్డి నాలుగుసార్లు విజయకేతనం ఎగురవేశారు. చేర్యాల నుంచి నిమ్మ రాజిరెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పాలకుర్తి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో చెన్నూరు నియోజకవర్గం రద్దుచేశారు. అదే స్థానంలో పాలకుర్తి నియోజకవర్గం ఏర్పాటు చేశారు. పాలకుర్తి నియోజకవర్గం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజయం సాధిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి నాలుగు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, టీఆర్‌ఎస్ ఒకసారి గెలుపొందారు. రాష్ట్రంలో ఏడు సార్లు గెలుపొందిన అతికొద్ది మంది నేతల్లో ఒకరైన ఎన్ యతిరాజారావు చెన్నూరు నుంచి గెలుపొందారు.
మహబూబాబాద్
మహబూబాబాద్‌కు మొత్తం 12 మార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ ఆరు సార్లు, టీడీపీ రెండుమార్లు, సీపీఐ రెండు మార్లు, టీఆర్‌ఎస్ ఒకసారి గెలుపొందారు. 1972 నుంచి 1989 వరకు ఐదు సార్లు జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మాలోత్ కవిత ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు.
డోర్నకల్
1957 సంవత్సరంలో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి నుంచి 14 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ గెలిచాయి. ఒకసారి టీడీపీ గెలిచింది. 1972లో నూకల రామచంద్రారెడ్డి, ఆయన అకాల మరణం తరువాత 1974లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా గెలవడం విశేషం. నూకల మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఆయన తరువాత రామసహాయం సురేందర్ రెడ్డి మరో నాలుగు మార్లు, తదనంతరం రెడ్యానాయక్ ఐదు మార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల సమయంలో పోటీ పడిన రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ ఇద్దరూ ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
జనగామ
జనగామ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు పొన్నాల లక్ష్మయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో 2014లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్‌ఎస్) చేతిలో ఓటమిపాలయ్యారు. జనగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా ఎనిమిది సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది.
పరకాల
పరకాలలో ఇప్పటివరకు 14 మార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) కలిసి ఆరుసార్లు విజయం సాధించాయి. భారతీయ జనసంఘ్, బీజేపీలు కలిసి మూడు సార్లు గెలిచాయి. టీడీపీ, టీఆర్‌ఎస్ రెండు సార్లు, సీపీఐ ఒక్క సారి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో, 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. 2014లో టీడీపీ నుంచి గెలుపొందిన చల్లా ధర్మారెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. 2004 సంవత్సరంలో టీఆర్‌ఎస్ పక్షాన గెలుపొందిన శారారాణి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌కు విరుద్ధంగా జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చినందుకు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అన ర్హురాలిని చేస్తూ స్పీకర్ సురేష్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
ములుగు
ములుగుకు 15 మార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఏడుసార్లు విజయం సాధించాయి. టీడీపీ నాలుగు సార్లు, టీఆర్‌ఎస్ ఒక సారి, పీడీఎఫ్ రెండు సార్లు గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంట్ గెలుపొందారు. 2014, 1994లో రెండుసార్లు మంత్రిగా చందూలాల్ పనిచేశారు. ఇక్కడ నుంచి మూడు మార్లు గెలిచిన జగన్నాయక్ కూడా మంత్రి పదవి చేపట్టారు.
వర్ధన్నపేట
వర్ధన్నపేటలో నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1994, 1999 ,2004 వరుసగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఇప్పటివరకు మూడు మార్లు టీడీపీ, మూడు మార్లు కాంగ్రెస్, బీజేపీ రెండు మార్లు, పీడీఎఫ్ రెండు మార్లు, ఎస్‌టీపీఎస్ ఒక సారి, టీఆర్‌ఎస్ ఒకసారి గెలుపొందారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కొంత కాలం ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
నర్సంపేట
నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 మార్లు ఎన్నికలు జరిగాయి. ఐదుసార్లు మద్దికాయల ఓంకార్ గెలుపొందారు. మూడు మార్లు సీపీఎం నుంచి రెండుసార్లు ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదు. ఇప్పటివరకు నర్సంపేట నుంచి మహిళ ఎమ్మెల్యేగా 1957లో కనరత్నమ్మ మాత్రమే గెలుపొందింది. రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి మూడు మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
వరంగల్ పశ్చిమ
నియోజకవర్గాల పునర్విభజన తరువాత హన్మకొండ రద్దయి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 2009లో ఏర్పడినప్పటి నుంచి మూడు మార్లు వరుసగా దాస్యం వినయ్‌భాస్కర్ గెలుపొందారు. హన్మకొండ నియోజకవర్గం 1952 నుంచి 2004 వరకు పది మార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐ మూడు మార్లు, టీడీపీ మూడు మార్లు, బీజేపీ ఒకసారి, టీఆర్‌ఎస్ ఒక సారి, పీడీఫ్ రెండు సార్లు గెలిచారు.
స్టేషన్ ఘన్‌పూర్
రిజర్వుడ్ స్థానమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇప్పటి వరకు 15 సార్లు జరిగాయి. ఐదుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ గెలుపొందాయి. తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి చెరో మూడుసార్లు గెలుపొందారు. గతంలో ఇదే నియోజకవర్గ ప్రాతినిథ్యం వహించిన కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి క్యాబినెట్‌లో రాజయ్య ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
వరంగల్ తూర్పు
నియోజకవర్గాల పునర్విభజన తరువాత వరంగల్‌కు బదులు వరంగల్ తూర్పు నియోజకవర్గంగా 2009లో ఏర్పడింది. ఇప్పటి వరకు 14 మార్లు ఎన్నికలు జరగగా ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మూడుమార్లు ఎమ్మెల్యేగా బస్వరాజు సారయ్య గెలుపొంది ఒక్కసారి మంత్రిగా పని చేశారు. టీడీపీ మూడు సార్లు, ఇండిపెండెంట్లు రెండు మార్లు, ఒకసారి టీఆర్‌ఎస్ గెలుపొందాయి.
భూపాలపల్లి
నియోజకవర్గాల పునర్విభజన తరువాత శాయంపేట రద్దయింది. దాని స్థానంలో భూపాలపల్లి నియోజకవర్గం 2009లో ఏర్పడింది. భూపాలపల్లిలో 2014లో మధుసూదనాచారి, 2009లో గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. 2014లో గెలుపొందిన మధుసూదనాచారి తొలి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2009లో గెలుపొందిన వెంకటరమణ రెడ్డి ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. శాయంపేట నియోజకవర్గంలో ఏడు మార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ నాలుగు సార్లు గెలిస్తే, టీడీపీ, బీజేపీ, జనతా పార్టీలు ఒక్కొక్కసారి గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment