‘తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా పునర్విభజన చేస్తం.. జగిత్యాలను జిల్లాగా మారుస్తం.. మొదటి ప్రాధాన్యం జగిత్యాలకే ఇస్తం..’ - ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రకటన.
‘కోరుట్ల జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తాం..’ - కోరుట్ల జిల్లా సాధన సమితి నేతలకు ఎంపీ కవిత హామీ
కోరుట్ల: తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి రాకముందే.. కొత్త జిల్లా ఏర్పాటు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. జగిత్యాలను జిల్లాగా మార్చాలన్న ప్రతిపాదన ప్రస్తుతం కాగితాల్లో ఉండగా.. కోరుట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమం ఊపందుకుంది. గతంలోనే జగిత్యాలను జిల్లా కేంద్రంగా మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించగా.. కోరుట్ల జిల్లా ఏర్పాటు కోరుతూ శనివారం అఖిలపక్ష నాయకులకు ఎంపీ కవితను కలిశారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి మద్దతు ఇస్తామని ఆమె చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకే డివిజన్‌లోని రెండు ప్రాంతాల్లో జిల్లా కేంద్రం ఎవరికి దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.
గతంలో కోరుట్ల సెగ్మెంట్ కోసం ఉద్యమం నిర్వహించి సక్సెస్ అయిన కోరుట్ల వాసులు ఈసారి జిల్లా సాధనకు ఉద్యమానికి పూనుకున్నారు. కోరుట్లను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్న సాధన సమితి ప్రతినిధులు అందుకు అనుకూలంగా పలు అంశాలను ఎత్తిచూపుతున్నారు. కరీంనగర్-నిజామాబాద్ జిల్లాలకు మధ్యభాగంలో ఉండటంతో మూడు జిల్లాల్లోని సుమారు 25 మండలాలకు అందుబాటులో ఉండి భౌగోళిక సౌలభ్యతను కలిగి ఉంది. దీనికితోడు కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ తర్వాత కోరుట్ల మండలంలోనే ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉన్నాయి. సుమారు 1400 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండటంతో జిల్లా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని కార్యాలయాలకు ఎలాంటి స్థల సమస్య ఉండబోదని వాదిస్తున్నారు. ఇప్పటికే సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న కోరుట్ల ప్రస్తుతం ఫస్ట్‌గ్రేడ్ మున్సిపాలిటీకి ఉండాల్సిన ఆర్థిక పరిపుష్టితో పాటు జనాభా వంటి అర్హతలు కలిగి ఉంది. దీంతోపాటు జిల్లా కేంద్రంలో ఉండే వెటర్నరీ యూనివర్సిటీ కోరుట్లలోనే ఉంది. ఈ నేపథ్యంలో కోరుట్ల జిల్లా కేంద్రంగా కావాలని కోరుతూ స్థానిక అఖిలపక్ష నాయకులు ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఓ అడుగు ముందుకేశారు.
38 రోజుల దీక్షలు..
జిల్లా సాధన కోరుతూ ఉద్యమించిన కోరుట్ల అఖిలపక్ష నాయకులు, స్థానిక యువజన, కుల, కార్మిక సంఘాల మద్దతుతో ముందుకు కదిలారు. మొదట ధర్నాలు, రాస్తారోకోలతో జిల్లా సాధన ఆకాంక్షను చాటి చెప్పిన అఖిలపక్ష నాయకులు తదనంతర కాలంలో ఉద్యమాన్ని రిలే దీక్షల రూపంలోకి మార్చా రు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, వివిధ పక్షాల నాయకులను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ప్రతీ రోజు ఓ సంఘానికి చెందిన ప్రతినిధులు దీక్షల్లో కూర్చుని కోరుట్ల వాసుల ఆకాంక్షను చాటిచెప్పారు. 38రోజుల పాటు దీక్ష కొనసాగించిన అఖిలపక్ష నాయకులు ఎంపీ కవిత హామీతో సోమవారం దీక్షలను విరమించారు. జిల్లా రూపకల్పనకు సంబంధించి ఎలాం టి ప్రతిపాదనలు తె రపైకి వచ్చినా.. మళ్లీ ఉద్యమానికి సిద్ధంగా ఉంటామని ప్రకటించడం గమనార్హం.
దశలవారీగా ఉద్యమం సాగుతుంది
కోరుట్లకు జిల్లా కేంద్రంగా ఉండాల్సిన అర్హతలు అన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఎంపీ కవిత హామీతో రిలే దీక్షలు విరమిస్తున్నాం. జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలను ఉన్నత శ్రేణి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం. జిల్లా కేంద్రం కోసం విడుతల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం.
- చెన్న విశ్వనాథం, జిల్లా సాధన ఉద్యమ సమతి కన్వీనర్
అనుకూల అంశాలు ఎన్నో..
జిల్లా కేంద్రంగా మార్చడానికి అవసరమైన అన్ని హంగులు కోరుట్లకు ఉన్నాయి. కోరుట్ల చుట్టుపక్కల ఉన్న మండలాల ప్రజలు సైతం ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది.
- వాసాల గణేష్, యవజన సంఘాల నాయకులు, కోరుట్ల
ఎల్లవేళలా ముందుంటాం
కోరుట్లను జిల్లా కేంద్రంగా మార్చడానికి జరిగే ఉద్యమానికి స్థానిక కుల సంఘాలు ఎల్లవేళలా మద్దతుగా ఉంటాయి. అన్ని కులసంఘాలు చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నాయి. నాయకులు అందరూ కలిసిరావడం ఆశించదగ్గ పరిణామం.
- దేవయ్య, నాయీబ్రహ్మణ సంఘ నాయకులు