నిర్వాసితులకు అండగా ఉంటాం! | Displaced'll be back! | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు అండగా ఉంటాం!

Published Mon, Dec 29 2014 1:54 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

నిర్వాసితులకు అండగా ఉంటాం! - Sakshi

నిర్వాసితులకు అండగా ఉంటాం!

ఎమ్మెల్యే : పెద్దాయనా.. మీకేమైనా సమస్యలున్నాయా?
 బక్క కుర్మన్న : సారూ..! మాకు కొత్తగా ఇండ్లు ఎక్కడ ఇస్తరోనని తిప్పలు. ఒకసారి కలెక్టరమ్మ ఊర్నె లేప్కపొమ్మని సెప్పింది. ఇండ్లకోసం 40 ఎకరాలిచ్చిన గూడ్క.. అడివిల ఉండలేం. ఊరంతా ఒక్కసారి లేప్క పోవాలంటె ఎట్లయితది! మేమంతా యాడ ఉండేది. ఎకరాకు రూ.70 వేలు, రూ.90 వేలు పరిహారం ఇచ్చిండ్రు. బాగనే ఉంది.. పదేండ్ల కింద ఇచ్చిన పరిహారం యాడ సరిపోతది? ఇండ్లు కట్టియ్య     పోయిరి. ఇప్పుడు మేం ఏడ ఉండాలె చెప్పుండ్రు.
 ఎమ్మెల్యే : పెద్దాయనా! శంకరసముద్రం నిర్వాసితులకు ఇళ్లు కట్టించేందుకు 119 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. మీకే కాదు. ఇతర గ్రామాల వారికీ ఇళ్లు కట్టించాల్సి ఉంది. ఒక్కసారే ఇళ్లన్నీ పోవు. డ్యాం కట్టే స్థలాన్ని బట్టి విడతలుగా వెళ్లాలి. మిగతావి డ్యాం పూర్తయినంక వెళ్లాలి. మీ ఇంటికి పరిహారమెంత వచ్చింది?
 బక్క కుర్మన్న: మా ఇంటికి నష్టపరిహారం కింద రూ. 7.50 లక్షలు మంజూరైనయి. వాటిని ఇప్పించేందుకు కష్టపడిన వకీలు 30శాతం డబ్బులు తీసుకోగా, మిగిలిన రూ.5.30 లక్షలు చేతికి వచ్చినయ్.
 ఎమ్మెల్యే: అన్నా.. నీపేరేంటి? రిజర్వాయర్ నిర్మాణం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
 బాధిత రైతు : నా పేరు బాలస్వామి. శంకరసముద్రం రిజర్వాయర్‌ను నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది రైతులకు ప్రయోజనం కలిగించే ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు మేం పొలాలు, ఇళ్లు త్యాగం చేశాం. నష్టపరిహారం కూడా ఇచ్చారు. కానీ ఇండ్లు నిర్మించేందుకు రోడ్డు పక్కన్నస్థలాన్ని అడుగుతున్నాం.
 
 ఎమ్మెల్యే : నష్టపరిహారం అందజేయడంలో ఆలస్యానికి కారణం ఏమనుకుంటున్నారు?
 శేఖర్‌గౌడ్ : గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ముగ్గురు కలెక్టర్లు మారారు. నిర్వాసితులకు ఇళ్లు నిర్మించేందుకు స్థలం కూడా కేటాయించడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. మాకు రోడ్డుపక్కన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. మీ నుంచి పరిష్కారం అవుతదని ఆశిస్తున్నాం.
 
 ఎమ్మెల్యే: శంకరసముద్రం నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు గతనెల రాష్ట్ర మంత్రి హరీష్‌రావు వచ్చి వెళ్లినంకా పనులు ఏమైనా జరిగాయా?
 శేఖర్‌గౌడ్ : గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిర్వాసితులకు కొంతఊరట కలుగుతోంది. ఈ మధ్య మంత్రి హరీష్‌రావు సారూ.. కానాయిపల్లికి వచ్చిన సందర్భంలో మా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.
 
 ఎమ్మెల్యే: మంత్రి హరీష్‌రావు వచ్చిపోయినంక సమస్య ఏమైనా పరిష్కారమైందా?
 బందెన్న: గత ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఇళ్లు నిర్మించుకునేందుకు అనువుగా లేదు. ఈ విషయాన్ని మంత్రి హరీష్‌రావుకు విన్నవించాం. ఆయన అప్పటికప్పుడు మాకోసం కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. గ్రామస్తుల కోరిక మేరకురోడ్డు పక్కనే నిర్వాసితులకు ఇళ్లు నిర్మించాలనిఅధికారులను ఆదేశించారు. మాకోసం కేటాయించిన 40 ఎకరాల్లో 20 ఎకరాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తూ మంత్రి ఆదేశించారు.
 
 ఎమ్మెల్యే : మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా?
 అంజన్న: రిజర్వాయర్ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ మా పొలాల వద్ద సామాను వేసుకుంటున్నారు. దీంతో రిజర్వాయర్ పూర్తయ్యే వరకైనా పంటలు వేసుకోవాలంటే వీల్లేకుండా పోయింది. రిజర్వాయర్ నీటిముంపు పొలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఒడ్డున ఉన్న పొలాలకు అక్కడి నుంచి విద్యుత్ సరఫరా కావడం లేదు. పొలాలకు బండ్లబాట కూడా లేకుండా పోయింది. నీట మునిగిన 11 ట్రాన్స్‌ఫార్మర్లు బయటకు తీసి గడ్డ మీద ఉన్న పొలాలకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. విద్యుత్‌శాఖ అధికారులు దీన్ని పట్టించుకుంటలేరు.
 ఎమ్మెల్యే : విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తా! ఇళ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
 కొత్త శ్రీనివాసులు: శంకరసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో పరిహారం కింద పదేళ్ల క్రితం రూ.78వేలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు గోడలు కూడా నిర్మించుకోలేని పరిస్థితి. దీని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయాలని మంత్రి హరీష్‌రావుకు విన్నవించాం. మీ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేయాలి. నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకునేందకు స్థలం కేటాయించడంతో పాటు రూ.3.50లక్షల ప్యాకేజీ ఇవ్వాలి.
 
 ఎమ్మెల్యే : మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనిచేస్తున్నాడని మీరు భావిస్తున్నారా?
 కొత్త శ్రీనివాసులు: మీరు ఎమ్మెల్యే అయ్యాక మా వద్దకు రావడం ఇది మూడోసారి. గతంలో ఎవరూ ఇక్కడకు రాలేదు. ఇక్కడి నిర్మాణం పనులే కాకుండా, నిర్వాసితులకు సైతం మీ ఆధ్వర్యంలో వేగంగా సాయం అందుతుందా?
 ఎమ్మెల్యే : అన్నా..! మీ సమస్య ఏంటి?
 ఆంజనేయులు: మా తండాకు చుట్టుతా నీళ్లొస్తున్నయి. దీంతో మేం తండాలో నివాసం ఉండలేకపోతున్నం. మావి మొత్తం 60ఇళ్లు ఉన్నాయి. మా తండాకు పొయ్యే బాట కూడా మునిగిపోయింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మా తండా పూర్తిగా మునిగిపోతది. మా ఊరికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా రోడ్డు వేయండి. లేదంటే తండాను మరోచోటుకు మార్చండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement