
కళాశాలలో వాగ్వాదం (సీసీ పుటేజీ దృశ్యం)
భైంసా/భైంసాటౌన్ ఆదిలాబాద్ : డివిజన్ కేంద్రమైన భైంసాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్ చార్జి అప్పగింతపై హైడ్రామా కొనసాగింది. ఈ విషయంలో గతంలో పనిచేసిన ఇద్దరు ప్రిన్సిపాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. భైంసాలో ప్రిన్సిపాల్‌గా పని చేసిన ఖాలిక్ ఫిబ్రవరి 8, 2018లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జాయింట్ సెక్రెటరీగా పదోన్నతిపై బదిలీపై వెళ్లారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసే జుఫిషియా సుల్తానాకు భైంసాలోని కళాశాలకు సంబంధించిన ఎఫ్‌ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జెస్) అప్పగించారు.
అప్పటి నుంచి ప్రిన్సిపాల్‌గా జుఫిషియా సుల్తానా కొనసాగుతున్నారు. ఆ సమయంలో జుఫీషియా సుల్తానా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని పదోన్నతిపై వెళ్లిన ఖాలిక్‌కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో పని ఒత్తిడి మూలంగా ఐదు నెలలుగా ఇక్కడికి రాలేకపోవడంతో, ఖాలిక్ ఇక్కడి ప్రిన్సిపాల్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించలేకపోయారు. ఈ విషయం ఇలా ఉండగానే విద్యా సంవత్సరం ఆరంభంలోనే అధ్యాపకుల బదిలీలు జరిగాయి.
ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జుఫీషియా సుల్తానాకు ముథోల్ జూనియర్ కళాశాలకు బదిలీ అయింది. ఆమె స్థానంలో నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన షబానా తరున్నమ్‌కు బాధ్యతలు అప్పగించాలని వరంగల్ ఆర్‌జేడీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వేతనం ఆగడంతో..
పదోన్నతిపై వెళ్లిన ఇంటర్మీడియెట్ బోర్డు జాయింట్ సెక్రెటరీ ఖాలిక్ పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించనందుకుగాను ఐదు నెలల వేతనం ఆగినట్లు సమాచారం. ఉన్నతాధికారుల సూచన మేరకు బుధవారం భైంసా జూనియర్ కళాశాలకు చేరుకున్న ఖాలిక్ ఎల్‌పీసీ (లాస్ట్ పే సర్టిఫికెట్) కోసం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వద్దకు వచ్చారు.
పదిహేను రోజుల క్రితమే షబానా తరున్నమ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వులు ఇచ్చినా.. ఇటీవలే బదిలీపై వెళ్లిన జుఫీషియా సుల్తానా చార్జి ఇవ్వలేదు. ప్రిన్సిపాల్ కుర్చీ కోసం వీరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. చార్జి ఇచ్చేందుకు భైంసాకు వచ్చిన జుఫీషియా సుల్తానా, ఖాలిక్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ సమయంలో జుఫీషియా సుల్తానా దురుసుగా మాట్లాడి, అసభ్య పదజాలంతో దూషిస్తూ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌ను ఖాలిక్‌పై విసిరి గాయపరించినట్లు సమాచారం.
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు..
భైంసా కళాశాలలో కొనసాగిన ఈ వాగ్వాదంపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జాయింట్ సెక్రెటరీగా పని చేస్తున్న ఖాలిక్ ఉన్నతాధికారులకు కళాశాల ఆవరణ నుంచి ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ డీఐవో దస్రునాయక్ ఆర్‌జేడీ సుహాసిని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ కమిషనర్ అశోక్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు.
కొత్త ప్రిన్సిపాల్‌కు అందని బాధ్యతలు..
గతంలో భైంసాలో పనిచేసిన ఇద్దరు ప్రిన్సిపాళ్ల మధ్య బాధ్యతల అప్పగింతపై జరిగిన మాటల యుద్ధం, వాగ్వాదంతో పరిస్థితి వేడెక్కిపోయింది. అక్కడే పనిచేస్తున్న తోటి లెక్చరర్లంతా ప్రిన్సిపాల్ గదికి చేరుకున్నారు. జరిగిన ఘటనంతా తెలుసుకుని ఇరువురిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొత్తగా ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకునేందుకు వచ్చిన షబానా తరున్నమ్ ఏమీ చేయలేకుండా వెనుదిరిగింది.
దురుసుగా ప్రవర్తించారు..
ఎల్‌పీసీ కోసం భైంసా కళాశాలకు వచ్చాను. పని ఒత్తిడి కారణంగా ఇక్కడికి రాలేకపోయాను. చార్జి ఇచ్చే సమయంలో అన్ని విషయాలు తెలియజేశాను. ఎల్‌పీసీ లేని కారణంగా నాకు ఐదు నెలలుగా వేతనం నిలిచింది. దీంతో ఎల్‌పీసీ కోసం భైంసాలోని కళాశాలకు వచ్చిన నాపై అప్పటి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జుఫీషియా సుల్తానా దురుసుగా ప్రవర్తిస్తూ నాపై వాటర్ బాటిల్ విసిరి దాడికి దిగింది. ఎల్‌పీసీ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఇక్కడ జరిగిన విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాను. - ఖాలిక్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జాయింట్ సెక్రెటరీ
ఖర్చుల వివరాలు అందివ్వని కారణంతోనే..
ఫిబ్రవరిలో పదోన్నతిపై వెళ్లిన ఖాలిక్ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించలేదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జాయింట్ సెక్రెటరీగా పనిచేసేందుకు వెళ్లిన సమయంలో కళాశాలకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలు, ఖర్చులు అప్పగించలేదు. సుమారుగా రూ.2.58 లక్షలకు సంబంధించిన వివరాలు సరిగ్గా లేవు.
ఈ కారణంగా లాస్ట్ పే సర్టిఫికెట్ ఇవ్వలేదు. కొత్తగా నియమితులైన షబానా తరున్నమ్ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే బాధ్యతలు అప్పగించలేదు. త్వరలో నేనే ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపడతాను. - జుఫీషియా సుల్తానా
Comments
Please login to add a commentAdd a comment