సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను క్యామ మల్లేశ్‌కే కట్టబెడుతూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రెండు నెలల క్రితమే మల్లేశ్‌కు పగ్గాలు అప్పగిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. అయితే, ఈ నియామకంపై పార్టీలోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా పోస్టింగ్‌ను పెండింగ్‌లో పెట్టిన హైకమాండ్.. మల్లేశ్ కే అధ్యక్షపీఠం కట్టబెడుతూ బుధవారం గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్తర్వులిచ్చారు. ఎన్నికలకు ముందు డీసీసీ అధ్యక్షుడిగా క్యామ పనిచేశారు.
అయితే, జోడు పదవుల అంశం తెరమీదకు రావడంతో మల్లేశ్ స్థానే పడాల వెంకటస్వామిని నియమించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్గీయుడిగా పేరున్న వెంకటస్వామి చేవెళ్ల అసెంబ్లీ స్థానాన్ని ఆశించి భ ంగపడ్డారు. ఈ క్రమంలో డీసీసీ పదవితో ఆయనను సంతృప్తి పరిచారు. ఆ తర్వాత, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశలో భాగంగా నెల రోజుల క్రితం తెలంగాణలోని మెదక్, రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులను మార్పు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
ఎకాఎకిన పడాలను పార్టీ పదవి నుంచి త ప్పిస్తూ క్యామకు అప్పగించ డాన్ని జీర్ణించుకోలేని ఆయన వైరివర్గం... ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసింది. మల్లేశ్ నియామకాన్ని అపకపోతే తాడో పేడో తేల్చుకుంటామని మాజీ మంత్రి సబిత వర్గీయులు పీసీసీకి అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలుండడం, అవి కూడా రంగారెడ్డి జిల్లాలోనే జరుగుతుండడంతో ఈ వ్యవహారం పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందని భావించిన ఏఐసీసీ పెద్దలు నియామకాన్ని పెండింగ్‌లో పెట్టారు.
ఈ క్రమంలోనే ఈ నియామకాలు ఆగిపోయినట్లేనని భావించిన మల్లేశ్ వ్యతిరేకవర్గానికి పీసీసీ తాజా నిర్ణయం షాక్ ఇచ్చింది. పడాలను తప్పించడం ఒక ఎత్తయితే... తమకు పొసగని క్యామకే తిరిగి డీసీసీ కళ్లెం ఇవ్వడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిభారంతో కుంగిపోతున్న తమకు పార్టీలో అసమ్మతి రాజకీయాలను పెంచి పోషించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వాపోతున్నారు. మ రోవైపు, తనపట్ల పార్టీ అవమానకర రీతిలో వ్యవహరించిందని కలత చెందిన డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట స్వామి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
కలుషిత రాజకీయాల్లో తనలాంటి వారికి స్థానంలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన... రాజకీయాలకు దూరమైనా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ధనస్వామ్యం పెరిగిపోయిందని, రౌడీలు, గూండాలకే పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని, దళితులకు గౌరవంలేదని వాపోయారు.
క్యామకే డీసీసీ పగ్గాలు
Published Wed, Sep 24 2014 11:26 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement