కలెక్టర్ రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేస్తున్న క్యామ మల్లేశ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘మా పార్టీకి కూడా ఎకరం భూమి కేటాయించండి. జాగ కేటాయిస్తే.. భవనం నిర్మించుకుంటాం’ అని రాజకీయ పార్టీలు అభ్యర్థిస్తున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఆఫీసులకు జిల్లాలో ఎకరం చొప్పున కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వారం రోజుల క్రితం జరిగిన కేబినెట్‌లో జిల్లాకో గులాబీ భవన్‌కు ఎకరం భూమిని కేటాయించిన సర్కారు.. ఇతర పార్టీలకు కూడా ఇదే విధానాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది.
గజానికి రూ.వెయ్యి చొప్పున స్థలాలను బదలాయిస్తామని స్పష్టం చేసింది. ఇదే అదనుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి గురువారం డీఆర్‌ఓ స్వర్ణలతను కలిసి భూమిని కేటాయించాలని కోరారు. తాజాగా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ కూడా కలెక్టర్ రఘునందన్‌రావును ఇదే విషయమై సంప్రదించారు. నూతన కార్యాలయం నిర్మించుకునేందుకు జిల్లా కేంద్రం సమీపంలో ఎకరం భూమిని కేటాయించాలని ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
వాస్తవానికి గతంలో టీడీపీకి ఎల్‌బీనగర్‌లో పార్టీ ఆఫీసు కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విలువైన స్థలాన్ని కేటాయించింది. దీంట్లో పార్టీ కార్యాలయం నిర్మించకపోగా.. అన్యాక్రాంతమైంది. మరోవైపు ఇటీవల శంషాబాద్‌లో సొంత వనరులతో భూమిని సేకరించిన బీజేపీ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. ఇక ఉభయ కమ్యూనిస్టులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కొలువుదీరారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో వామపక్షాలు, వైఎస్సార్ సీపీ, బీజేపీ కూడా స్థలం కోసం కలెక్టరేట్ బాట పట్టే అవకాశం లేకపోలేదు. ఇది ఒక రకంగా జిల్లా యంత్రాంగానికి తలనొప్పి కలిగించే అంశం. భూముల విలువలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కనీస ధరలకు ఎకరం భూమిని కేటాయించాలనే నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment