పేదజిల్లా అనేముద్ర చెరిపేస్తా | district new collector gd priyadharshini | Sakshi
Sakshi News home page

పేదజిల్లా అనేముద్ర చెరిపేస్తా

Published Tue, Aug 5 2014 5:26 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

పేదజిల్లా అనేముద్ర చెరిపేస్తా - Sakshi

పేదజిల్లా అనేముద్ర చెరిపేస్తా

కలెక్టర్ జీడీ ప్రియదర్శిని
సాక్షి, మహబూబ్‌నగర్: ‘మహబూబ్‌నగర్ పేద జిల్లా అని ఎందుకనాలి. అతిపెద్ద జిల్లా అయ్యుండి, అన్ని వనరులున్నా వెనుకబడటానికి కారణమేంటి? పేద జిల్లా అని జాలి చూపడం నాకు నచ్చదు..! నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో తెలియదు. ఉన్నంతలో కష్టపడి నేను వెళ్లే లోపు పేదజిల్లా అనే ముద్రను చెరపడం కోసమే శతవిధాలా ప్రయత్నిస్తా. జిల్లాకు ఎంతో చేయాలని ఉంది. అన్నింటిపై సమీక్షించిన తర్వాతే జిల్లాకు ఏం అవసరమవుతాయనే ఒక అంచనాకు వస్తా’ అని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాను ఎలా అభివృద్ధి చేస్తారనే అంశంపై ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే....
 
‘‘వాస్తవానికి జిల్లా కలెక్టర్‌గా రావడం అనుకోకుండా జరిగింది. మహబూబ్‌నగర్‌కు వెళ్లాలని సాయంత్రం పిలిచి చెప్పారు. పొద్దునకల్లా వెళ్లి విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా గురించి ఆలోచించే సమయమే చిక్కలేదు. వచ్చి రాగానే మళ్లీ రెండు రోజులు హైదరాబాద్‌లో రివ్యూ మీటింగ్స్‌కి వెళ్లాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం మన ముందు మూడు అంశాలున్నాయి. మొదటిది ‘మన ఊరు- మన ప్రణాళిక’. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను బలోపేతం చేయాలనే ఒక బలమైన కృత నిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను బలోపేతం చేసే చర్యలు మరింత విస్తృతం చేస్తాం. రెండోది భూమిలేని ఎస్సీలకు మూడెకరాలు అందేలా చూడటం.

మూడోది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘సమగ్ర సర్వే’ను పూర్తి చేయడం. భూపంపిణీకి పరిమితి అనేది ఏమీ లేదు. ఆగస్టు 15న చేసే భూ పంపిణీ మొదటి విడత మాత్రమే. ఈ ప్రక్రియ మున్ముందు కూడా కొనసాగుతుంది. భూమి అందుబాటులో లేనందున చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి భూమీ లేని ఎస్సీలను గుర్తించి వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగా ఈ సారి ప్రతి నియోజకవర్గం నుంచి 30 మందికి ఇవ్వాలనుకుంటున్నాం. మేము ఇచ్చే భూమి పూర్తిగా సాగు యోగ్యమయ్యేదే కొని ఇస్తున్నాం.

అలాగే సాగుకు అవసరమయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దీనికి ఒక నిర్ణయానికి రావాలంటే ఇంకా రెండుమూడ్రోజుల్లో ఒక స్పష్టత వస్తది. అప్పుడే పూర్తిగా చెప్పగలం. జిల్లా కేంద్రంలోనే తాగునీరు కొరత వేధిస్తోందని నా దృష్టికి వచ్చింది. అందుకోసం మన ప్రణాళికలో పెద్దపీట వేశాం. తక్షణం జిల్లా తాగునీటి అవసరాలు తీర్చడం కోసం రూ.1310 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. వర్షాభావ పరిస్థితుల విషయమై వ్యవసాయ శాఖతో చర్చిస్తా. వర్షాభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఏయే ప్రాంతాలకు ఎలాంటి పంటలు వేసుకొవచ్చని వ్యవసాయశాఖ ఏమైనా ప్రణాళిక తయారు చేసిందా? యాక్షన్‌ప్లాన్ ఉందా లేదా అనేది తెలుసుకుంటా.

ఒకవేళ చేయకపోతే త్వరతగతిన చేయాలని ఆదేశిస్తా. జిల్లాలో ఎక్కువగా కంటి జబ్బులు ఉన్నట్లు నాకు సమాచారం. అలాగే ఇతర ఎలాంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నాయనేది డీఎంహెచ్‌ఓ, ఇతర సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తా. ఆస్పత్రి అడ్మినిస్టేషన్ ఏ విధంగా జరుగుంతో పరిశీలిస్తా. పీహెచ్‌సీలు, ఆశవర్కర్లు, అంగన్‌వాడీలు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకుంటా. అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటా. జిల్లా అక్షరాస్యత 56శాతంగా ఉంది. దానిని మరింత మెరుగుపరచడం కోసం నిర్భంద విద్యను కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. పిల్లలను బడికి పంపాల్సిన ఆవశ్యకత పట్ల తల్లిదండ్రులకు మొదట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. రెగ్యులర్‌గా బడికి పంపిస్తే ప్రొత్సహకాల వంటివి పరిశీలిస్తాం.

ఆ తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే అపరాధ రుసుం వేస్తాం. డ్రాపౌట్స్ విషయమై డీఈఓ, ఎంఈఓలతో సమీక్షించి ఎక్కడ వెనకబడి ఉన్నామో గుర్తించి చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో మరుగుదొడ్లు వంటి చాలా ముఖ్యం. మరీ ఈ విషయంలో బాలికలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. టాయిలెట్ల నిర్వహణ పట్ల కూడా సీరియస్‌గా ఆలోచన చేస్తున్నాం. వీటిని విరాళాలు సేకరించైనా సరే, గ్రామంలోని కమిటీలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకునే ఆలోచన చేస్తున్నాం. ప్రత్యేకంగా వలసలను నివారించే విషయంపై ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. ఊరికి ఏం కావాలో వారి నుంచే తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తాం. ముఖ్యంగా ఇక్కడి నుంచి వలసలు తగ్గించడం కోసం భారీగా పరిశ్రమలను ప్రోత్సహించాలి’’ అని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement