నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఎప్పటిలాగే జిల్లావాసులకు నిరాశ మిగిల్చింది.
సాక్షి, మంచిర్యాల : నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఎప్పటిలాగే జిల్లావాసులకు నిరాశ మిగిల్చింది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయన్న ప్రజల కలలకు గండిపడింది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును హై స్పీడు రైలుగా మారుస్తామన్న నిర్ణయం తప్ప మరేదీ జిల్లాకు దక్కలేదు. పెండిం గ్ ప్రాజెక్టులు, నూతన రైల్వేలైన్ల ప్రతి పాదనలపై ఇరు రాష్ట్రాల కోసం వేసిన కమిటీయే ఫైనల్ అని రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు.
దీంతో జిల్లాలోని ప్రతిపాదిత ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, స్టేషన్ల నవీకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదిలాబాద్-నిర్మల్, ఆదిలాబాద్-మంచిర్యాల్ వయా ఉట్నూర్ రైల్వే లైన్ల సర్వేపై ఉమ్మడి కమిటీ తరువాతే స్పష్టత రానుంది. దీంతోపాటు ఎంపీలు గొడం నగేశ్, బాల్క సుమన్‌ల ప్రతిపాదనలు బుట్టదాఖలే అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్- ఆదిలాబాద్ ఇంటర్‌సిటీ కేటాయింపు, ఖాజీపేట్-బల్లార్ష రూటులోని పలు రైళ్ల బోగీలకు ఏసీ బోగీలు అమర్చేందుకు స్పష్టత రాలేదు.
సికింద్రబాద్ నుంచి హజ్రత్ నిజామొద్దీన్(న్యూఢిల్లీ)ల మధ్య ప్రీమియం రైలు ఏర్పాటు అంశం జిల్లావాసులకు ఊరట కలిగించేదే అయినప్పటికి, జిల్లాలోని ఏయే స్టేషన్లలో ఈ రైలుకు నిలుపుదల(హాల్ట్) ఉంటుందనే దానిపై స్పష్టత లేదు.ప్రధాన రైల్వే స్టేషన్లలో సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నప్పటికి జిల్లాలో ఆ సౌలభ్యం పొందగల స్టేషన్లు ఏవి లేవు. ఖాజీపేట-కాగజ్‌నగర్‌ల మధ్య మరిన్ని రైళ్లు, మరిన్ని బోగీలు ఉంటాయనే ఆశతో రైల్వే బడ్జెట్ కోసం ఎదురు చూసిన జిల్లా వాసులకు మోడీ మార్కు బడ్జెట్ రుచించలేదు.
ఎంపీలు విన్నవించినా..
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం కాబట్టి నిధులు కేటాయిస్తారని భావించినప్పటికి సదానంద గౌడ నిరాశే మిగిల్చారు. ఆదిలాబాద్-గడ్‌చందూర్ రైలు సర్వే విషయంలోనూ మొండిచేయి చూపారు. మంచిర్యాల, బాసర రైల్వే స్టేషన్లలో ఔట్ పేషెంట్ డిస్పెన్సరీ ఏర్పాటుపై నిరాశే మిగిల్చారు. జిల్లాలో విశాలంగా విస్తరించి ఉన్న తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించేందుకు ఆదిలాబాద్-మంచిర్యాల వయా ఉట్నూరు రైలు లైను ఏర్పాటుతో, జిల్లాలోని ప్రజలకు రవాణా మార్గం సుగమమం అయ్యేది.
దీనిపై బడ్జెట్‌లో ప్రస్తావించక పోవడంపై జిల్లా వాసులు నిరాశ చెందుతున్నారు.
భాగ్యనగర్, సింగరేణి, రామగిరి, తెలంగాణ రైళ్లలో ఏసీ కోచ్‌లతోపాటు, అదనపు బోగీల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదు. ఈ విషయమై కేంద్ర రైల్వే మంత్రికి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వినతి పత్రం సమర్పించినప్పటికి ఫలితం లేదు. నవజీవన్, దర్బాంగ, జీటీ ఎక్స్‌ప్రెస్‌లను బెల్లంపల్లిలో హాల్ట్ చేయాలనే డిమాండును పట్టించుకోలేదు. ఆదిలాబాద్-సికింద్రాబాద్ రైల్వే లైను సర్వే కోసం ప్రతి బడ్జెట్‌లోను ఆశగా ఎదురు చూస్తున్న పశ్చిమ జిల్లా ప్రజలకు ఈసారి యథావిధిగా నిరాశే మిగల్చడం గమనార్హం. సింగిల్ లైన్ వల్ల అవస్థలు ఎదురవుతున్న హైదరాబాద్-ఆదిలాబాద్ డబ్లింగ్ పనులకు నిధుల కేటాయింపు లేనే లేదు. ఈ విషయమై ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ కేంద్ర మంత్రికి విన్నవించినా ఫలితం శూన్యం. ఈ సారైనా నిధులు విడుదల చేస్తే, ఈ లైను పనుల్లో పురోగతి ఉంటుందని భావించిన వారి ఆశలు అడియాశలయ్యాయి.