కొత్తగూడెం : జిల్లా ప్రజల ఆశలపై రైల్వే బడ్జెట్ నీళ్లు చల్లింది. ఈ దఫా ఎలాగైనా జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని, కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం తో పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశించిన జిల్లా వాసులకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. 2012లో మంజూరైన కొవ్వూరు లైన్‌తోపాటు, సింగరేణి బొగ్గు ఉత్పత్తికి కీలకమైన సత్తుపల్లి లైన్‌కు క్లియరెన్స్ వస్తుందని ఆశ పడినప్పటికీ.. నిరాశే మిగిలింది.
జిల్లాలో సింగరేణి గనులతో పేరెన్నిక కలిగిన కొత్తగూడెం కేంద్రంగా రైల్వే విస్తరణ చేయాల్సి ఉంది. అయితే సుమారు ఆరు దశాబ్దాలుగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)-కొవ్వూరు లైన్‌కు ఈ బడ్జెట్‌లో అసలు నిధులే కేటాయించకపోవడం గమనార్హం. 2012లో ఈ లైన్‌కు మంజూరు లభించినా.. నాటి నుంచి ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు.
ఈ లైన్ ఏర్పాటయితే సుమారు 100 గిరిజన గ్రామాలకు రైలు సౌకర్యం కలుగుతుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేందుకు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే 140 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశాలున్నాయి. ఇన్ని అవకాశాలున్న ఈ లైన్‌కు నిధులు మంజూరు చేయకపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత లైన్లకు మాత్రమే పర్యవేక్షణ కమిటీ వేసిన సదానంద బడ్జెట్ అందరినీ నైరాశ్యంలోకి నెట్టివేసింది.
సింగరేణికి తప్పని తిప్పలు..
పర్యావరణశాఖ ఆదేశాల మేరకు భవిష్యత్‌లో సింగరేణి సంస్థ చేపట్టే నూతన ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే బొగ్గును రైలు మార్గం ద్వారానే తరలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టాపురం ఓసీపీలలో ఉత్పత్తి చేసే బొగ్గు రవాణాకు కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ ముందుకొచ్చింది.
ఈ లైన్‌కు అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ లైన్ ఫైనల్ సర్వే కూడా పూర్తయింది. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో కొత్తగూడెం - సత్తుపల్లి లైన్‌కు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో సత్తుపల్లిలోని కొత్త ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేసిన బొగ్గును ఎలా సరఫరా చేయాలనే విషయంపై సింగరేణి సందిగ ్ధంలో పడింది.
ఉద్యోగులకూ ఊరట లేదు..
జిల్లాలో మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉండగా మొత్తం 1500 మంది వరకు రైల్వే ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు 7వ పే రివిజన్ కమిటీ కోసం ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వమైనా తమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 7వ పే రివిజన్‌కు అనుమతి ఇస్తుందని భావించిన ఉద్యోగులకు ఈ బడ్జెట్‌లోనూ నిరాశే ఎదురైంది.
‘సదా’ నిరాశే
Published Wed, Jul 9 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement
Advertisement