
కోర్టుకొచ్చిన వారి భూములను కొనడం లేదు
హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల భూములను జీవో 123 కింద తాము కొనుగోలు, రిజిస్ట్రేషన్లు చేయడం లేదని...
సాక్షి, హైదరాబాద్: హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల భూములను జీవో 123 కింద తా ము కొనుగోలు, రిజిస్ట్రేషన్లు చేయడం లేదని ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది. బలవంతంగా భూములు తీసుకుం టున్నామని పిటిషనర్లు చేస్తున్నవి ఆరోపణలు మాత్రమేనంది. హైకోర్టు స్పందిస్తూ, పిటిషనర్లు చెబుతున్న దాంట్లో వాస్తవముందని తేలితే, వారి భూముల జోలికి వెళ్లొద్దని స్పష్టమైన రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం జీవో 123 ద్వారా భూ కొనుగోలును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.
రైతులను బెదిరిస్తూ బలవంతంగా భూములు తీసుకుం టున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన రామ్మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మిస్టర్ ఏజీ! ఇదే విధమైన ఫిర్యాదులతో పలు పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇంతకూ ఏం జరుగుతోంది?’’ అని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. ‘‘కోర్టుకొచ్చిన వారి భూములను కొనుగోలు చేయబోమని మీరు స్పష్టంగా హామీ ఇచ్చారు కదా? అందుకు విరుద్ధంగా వెళ్తుంటే మేం స్పష్టమైన రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేసింది ఏజీ బదులిస్తూ, పిటిషనర్లవి ఆరోపణలేనని అన్నారు.
అసైన్డ్ భూములున్న వారికి అతి తక్కువ పరిహారం చెల్లిస్తున్నారని మరో న్యాయవాది అర్జున్ అన్నారు. మిగతా వారికి ఎకరాకు రూ.5.5 లక్షలు ఇస్తుంటే, వారికి మాత్రం రూ.3.5 లక్షలే ఇస్తున్నారని తెలిపారు. గౌరెల్లి రిజర్వాయర్ కోసం 2009లో చేపట్టిన భూ సేకరణకు ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని రచనారెడ్డి అన్నారు. స్వచ్ఛందంగా ఇస్తున్నారంటున్న ప్రభుత్వం వాస్తవానికి బలవంతపు భూ సేకరణకు దిగుతోందన్నారు. సామాజిక అధ్యయనం నిర్వహించకుండానే భూములను తీసుకుంటోం దని వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గురించి పరోక్షంగా ఆమె ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. దాంతో, రాజకీయ ప్రసంగాలకు కోర్టులను వేదిక చేసుకోరాదంటూ ఏజీ తీవ్రంగా స్పందించారు. ‘‘పిటిషన్‌లో ప్రస్తావించని అంశాలన్నింటినీ చెప్పడం సరికాదు. వాదనలను జీవో 123కే పరిమితం చేయాలి’’ అన్నారు.భూములను కొనుగోలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టుకు నివేదించారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.