ప్రభుత్వం మాటలకే పరిమితం కావద్దు
బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో స్పష్టమైన వైఖరితో ముందుకు సాగాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వడంతో పాటు పాలనలో వేగం పెంచాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో 10 తీర్మానాలను తూతూ మంత్రంగా ఆమోదించారే తప్ప.. కనీస చర్చ జరపలేదన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో పాత రుణం చెల్లిస్తే గానీ, బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేసే పరిస్థితి లేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని రుణమాఫీపై ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల వంటి వాటి విషయంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయని, ఇళ్ల నిర్మాణ పథకం నిలిచిపోయిందని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూంలు కట్టిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారని చెప్పారు. అలాగే, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీలో కూడా బెల్టు షాపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోలేదని, గత ప్రభుత్వం వైన్‌షాపుల నుంచి బార్లను వేరు చేయకపోవడంతో టీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు జరిగే ప్రసక్తే లేదని, దీనిని తాము అడ్డుకుంటామన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. సోమవారం నగరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సతీష్‌జీ పర్యవేక్షణలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు, జిల్లాల అధ్యక్షులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకాష్‌రెడ్డి, ప్రదీప్ కుమార్, భీంరావు తదితరులు పాల్గొన్నారు.