
అదను ఉంది.. ఆందోళన వద్దు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో రైతులకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా
పదో తేదీవరకూ విత్తనాలు వేసుకోవచ్చు..
పరిస్థితి ఇలాగే ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
వర్షాలు మాత్రమే సమస్య... విత్తనాలు,ఎరువుల కొరత లేదు
కొత్త రుణాలకు ఇబ్బందులు లేకుండా చేస్తాం
వచ్చే ఏడాదికి పూర్తి విత్తనోత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ
ఉద్యానవన పంటలపై ప్రత్యేకంగా దృష్టిపెడతామని వెల్లడి
హైదరాబాద్: రుతుపవనాల సీజన్ వచ్చినా రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా కురవకపోవడం నేపథ్యంలో... రైతులు ఆందోళన చెందవద్దని, ఇంకా సమయం మించిపోలేదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపడతామని రైతాంగానికి ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులకు ఎలాంటి కొరతా లేదని.. సరిగా వర్షాలు కురిస్తే చాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికారులతో విరివిగా సమావేశాలు నిర్వహిస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి.. ఖరీఫ్ సీజన్ మొదలు కావడం, వర్షాలు ఇంకా కురవకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...
జూలై 10 వరకు విత్తనాలు వేసుకోవచ్చు..
ఖరీఫ్ ప్రారంభమైనా వర్షాలు కురవకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. విత్తనాలు వేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. సమయం దాటిపోయినా విత్తనాలు వేసుకోవడానికి వచ్చే నెల 10వ తేదీ వరకు సమయం ఉంది. అప్పటికీ పరిస్థితి ఇలాగే ఉంటే అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపడతాం. ఈ మేరకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో కొన్ని చోట్ల నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిజామాబాద్ సహా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. వాతావరణ శాఖ కూడా వర్షాలు పడతాయని అంటోంది. కాబట్టి ముందే ప్రత్యామ్నాయాల గురించి, కంటింజెన్సీ ప్రణాళిక గురించి మాట్లాడితే రైతులు నిరాశపడతారు. వేచిచూద్దాం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని విధాలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది.
సోయాబీన్ విత్తనాలకు డిమాండ్..
రాష్ట్రంలో వర్షాల సమస్యేగానీ విత్తనాలు, ఎరువుల కొరత లేదు. గ్రామస్థాయి సొసైటీల ద్వారా విత్తనాలను రైతుల ముంగిటకు చేర్చాం. వికేంద్రీకరణ పద్ధతులు పాటించడంతో ఎవరూ విత్తనాల కోసం వీధుల్లోకి రావడం లేదు. ప్రస్తుతం సోయాబీన్ విత్తనానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. వాటిని కూడా అవసరం మేరకు సరఫరా చేస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేదు. తెలంగాణలో వివిధ రకాల ఎరువులు 17.44 లక్షల టన్నులు అవసరం కాగా.. ఇప్పటికే 7.50 లక్షల టన్నులను జిల్లాల్లో సొసైటీల వారీగా పంపించాం.
విత్తనోత్పత్తి లక్ష్యంగా...
తెలంగాణను దేశంలోనే విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారుచేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు, దేశాలకు విత్తనాన్ని సరఫరా చేయడం ద్వారా రైతులకు పెద్ద ఎత్తున లాభాలు చేకూరుతాయి. సాధారణంగా పండించే పంటల కంటే రెండింతల ఆదాయం విత్తన ఉత్పత్తి ద్వారా వస్తుంది. వచ్చే ఏడాదికి ఆ లక్ష్యాన్ని సాధిస్తాం. డిమాండ్ అధికంగా ఉన్నందున సోయాబీన్ విత్తనాన్ని కూడా ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం. ఈ ఏడాది ఖరీఫ్ నుంచే ఆ పని మొదలుపెడతాం.
స్ట్రాబెర్రీ పంటపై దృష్టి..
ఉద్యానవన పంటలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నాం. ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. ఈ అంశంపై ఇప్పటికే చాలా సమావేశాలు నిర్వహించాం. స్ట్రాబెర్రీ జపాన్‌లో ప్రధానమైన పంట. దానిని నిత్యం ఉపయోగిస్తే కేన్సర్ వచ్చే అవకాశాలను దూరం చేస్తుంది. దీన్ని సాగుచేయడానికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు జపాన్ ముందుకొచ్చింది. కొంతమంది ఔత్సాహిక యువకులను పంపిస్తే ఉచిత వసతి సదుపాయాలు సమకూర్చి మరీ శిక్షణ ఇస్తామని.. ప్రయాణ చార్జీలు భరిస్తే చాలని ఆ దేశ ప్రతినిధులు హామీ ఇచ్చారు కూడా.
వ్యవసాయ వర్సిటీని మరింత తీర్చిదిద్దుతాం..
ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఆ వర్సిటీ బడ్జెట్లో అధిక భాగం నాన్-ప్లానింగ్‌కే ఖర్చు చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. వర్సిటీలో రాజకీయాలు నడుస్తున్నాయి. పరిశోధన విభాగాన్ని గాడిలో పెట్టాలి. దీనిపై ఇప్పటికే అనేకమందితో మాట్లాడాను.
రుణమాఫీ ప్రతిపాదనలు సిద్ధం వ్యవసాయశాఖ మంత్రి పోచారం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీకి అనుగుణంగా తెలంగాణలో పంట రుణాల మాఫీకి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. వ్యవసాయ రుణాలతో పాటు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు కలిపి సుమారు రూ.20వేల కోట్లు మాఫీ చేయనున్నట్లు చెప్పారు. తద్వారా 32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ ఈ నెల 23వ తేదీన నగరానికి వస్తున్న సందర్భంగా పోచారం వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రుణాల మాఫీ, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, లాభసాటి పంటలపై రైతులకు అవగాహన కల్పించడం వంటి పలు అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు, తదితరాల గురించి చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పంట రుణాల మాఫీ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. బ్యాంకర్లకు సంబంధించిన చిన్నచిన్న అంశాలు తప్ప పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామన్నారు. మేఘ మధనం గతంలో విజయవంతం కాలేదని, అయినా రుతు పవనాలు ఆశాజనకంగా ఉన్నందున వర్షాలు పడుతాయనే నమ్మకం ఉందని మంత్రి చెప్పారు.