పుట్టక ముందే చంపేశాడు
పుట్టక ముందే చంపేశాడు
Published Thu, Jun 8 2017 4:08 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM
రోజుకు ఐదారుగురు గర్భిణులకు స్కానింగ్
వారిలో ముగ్గురు లేదా నలుగురికి గర్భ విచ్ఛిత్తి
ఈ ఏడాది 350 అబార్షన్లు
పోలీసుల విచారణలో వెల్లడించిన డాక్టర్ శ్రీనివాస్ ?
సాక్షి, మహబూబాబాద్: ఆడశిశువుల పాలిట మృత్యువుగా మారిన కురవి డాక్టర్ శ్రీనివాస్ చేసిన దారు ణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తల్లిగర్భం లోని ఆడశిశు పిండాలకు యమగండంగా మారిన అతడు వైద్యం ముసుగులో అమానుషానికి పాల్పడుతుంటే ఇన్నాళ్లు వైద్య శాఖాధికారులు అటువైపు కూడా కన్నెత్తి కూడా చూడలేదు. లింగ నిర్ధారణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి గర్భిణులు వస్తున్నా ఇక్కడి అధికారులకు మాత్రం విషయం తెలియలేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే కురవిలో డాక్టర్ శ్రీనివాస్ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తుంటే తమ వాటా తాము తీసుకొని చూసీచూడనట్లు వదిలేశారు. ఫలితంగానే అతడి దందా ఇన్నాళ్లు యథేచ్ఛగా సాగింది. మంగళవారం స్ట్రింగ్ ఆపరేషన్ అనంతరం శ్వేత నర్సింగ్‌హోమ్ నిర్వాహకుడు డాక్టర్ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడిని విచారించగా తాను రోజుకు ఐదుగురి నుంచి ఆరుగురికి స్కానింగ్ చేస్తే వారిలో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఆడశిశువు అని తేలేదని, విషయం పేషెంట్‌కు చెబితే, ఇప్పటికే తమకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మళ్లీ ఆడపిల్ల వద్దు తీసేయండి.. అని చెప్పేవారని పోలీసుల ఎదుట వెల్లడించినట్లు తెలిసింది. ఇలా రోజు ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఆడశిశువుల పిండాలను తొలగించానని... ఈ సంవత్సరంలో దాదాపు 350కిపైగానే ఆడశిశువుల పిండాలను తొలగించానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం.
తెలిసినా పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ
జిల్లా కేంద్రం నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోనే ఇంత జరుగుతున్నా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అటువైపే చూడలేదు. ఆ శాఖలో కింది నుంచి పై అధికారి వరకు తెలిసినప్పటికీ పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. సదరు వైద్యుడు ప్రతి నెలా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు కాసులు ఇచ్చి అటువైపు రాకుండా చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్కానింగ్ సెంటర్లలో పోలీసుల తనిఖీలు
తొర్రూరు(పాలకుర్తి): డివిజన్ కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లోని స్కానింగ్ సెంటర్లలో పోలీసులు బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు తొర్రూరు డీఎస్పీ రాజారత్నం, సీఐలు చేరాలు, శ్రీనివాస్, ఎస్సైలు రమణమూర్తి, ఫణిదర్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ సెంటర్ అనుమతి పత్రాలు, ఇతర సర్టీఫికెట్లు, స్కానింగ్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలు, బిల్లు బుక్స్, రికార్డులు వంటివాటిని పరిశీలించినట్లు చెప్పారు. ఏ స్కానింగ్ సెంటర్‌నైనా అనుమతి లేకుండా నడిపినా, లింగనిర్ధారణ తెలిపేందుకు స్కానింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సెంటర్లను సీజ్ చేసి, సంబంధిత సెంటర్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు సెంటర్ల నిర్వాహకులను ఎస్సై రమణమూర్తి హెచ్చరించారు.
Advertisement