బాలానగర్ ఠాణాలో ఆరోగ్య పరీక్షలు
సాక్షి, సిటీబ్యూరో: శాంతిభద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్ల పరిధిలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహించినా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించిన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రతి పోలీసు స్టేషన్‌లో వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీపీ ఆదేశాల ప్రకారం సైబరాబాద్ పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో వివిధ ఆస్పత్రుల వైద్యులను సమన్వయం చేసి ప్రతి బుధవారం కొన్ని ఠాణాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాలానగర్, మాదాపూర్, రాయదుర్గం, ఆర్‌సీపురం, శంషాబాద్ పోలీస్ స్టేషన్లలో యశోధ, కేర్ హైటెక్ సిటీ, మ్యాక్స్ క్యూర్, కాంటినెంటల్, సిటిజన్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బందికి రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ, 2డీ ఎకోటెస్టులు, కార్డియో, ఆర్థో, జనరల్ మెడిసిన్ డాక్టర్లతో కన్సల్టేషన్ నిర్వహించారు. దీంతో పాటు ఎఫ్‌ఎంస్ డెంటల్, డాక్టర్ ఐ అగర్వాల్, మెక్సివిజన్ వారిచే దంత, కంటి పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది పని చేసే స్థలంలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్య భద్రత ద్వారా చికిత్సలు చేయించుకునేందుకు అవకాశం ఉంది. వచ్చే బుధవారం మిగతా పోలీస్ స్టేషన్‌లో కూడా వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రజల వద్దకే పాలనలా, సిబ్బంది పనిచేసే చోటే ఆరోగ్య పరీక్షలు ఏర్పాటు చేసి నూతన ఒరవడికి నాంధి పలికిన సైబరాబాద్ సీపీకి పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శిబిరాల్లో సీఏఆర్ అడిషనల్ డీసీపీ మణిక్ రాజ్, అడిషనల్ డీసీపీ సైబరాబాద్ పర్యవేక్షణలో పోలీస్ డాక్టర్లు సరిత, సుకుమార్ పాల్గొన్నారు. సీఏఆర్ అడిషనల్ డీసీపీ మణిక్ రాజ్, డాక్టర్లు సరిత, సుకుమార్, సంబంధిత ఇన్‌స్పెక్టర్లకు పోలీస్ అధికారుల సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు.
ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు
చార్మినార్: విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీసులు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. బుధవారం పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంగా ఉండటం కూడా ఎంతో అవసరమన్నారు. పోలీసు విభాగంలో పని చేస్తున్న అన్ని స్థాయిల్లోని సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ మురళీకృష్ణతో పాటు అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ నారాయణ్ రావు, డాక్టర్ హరినాథ్, డాక్టర్ ప్రశాంత్ గుప్తా, డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లోని పెట్రోలింగ్ వాహనాల ఫిట్‌నెస్ తదితర అంశాలను పరిశీలించి వాహనాల పనితీరు పట్ల సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment