సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైద్య స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేస్తే, చాలామంది విధుల్లో చేరేందుకు విముఖత చూపిస్తున్నారు. మొత్తం 911 స్పెషలిస్టు వైద్యులను నియమించగా, ఇప్పటివరకు దాదాపు 600 మందే చేరినట్లు వైద్య విధాన పరిషత్ వర్గాలు చెబుతున్నాయి.
తమకు ఇచ్చిన పోస్టింగ్ మార్చాలని కొందరు కోరుతుంటే, భార్యాభర్తలను వేర్వేరుగా వేశారని మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరైతే పోస్టింగుల్లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. దీంతో అనేకమంది హైదరాబాద్ వైద్య విధాన పరిషత్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరైతే మంత్రులు, ఎమ్మెల్యేలతో పైరవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో చేరే గడువును ఈ నెల 29 వరకు పొడిగించారు.
నేరుగా పోస్టుల భర్తీ..
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. 911 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించారు. ఈ నెల 6న ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 14 హైదరాబాద్‌లోని ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో వైద్యులకు పోస్టింగ్‌లు లభించాయి.
సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆసుపత్రుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్య మొదలైంది. పైరవీలు చేయించుకున్న వారికి మంచి పోస్టింగులు ఇచ్చారని, మిగిలిన వారికి అన్యాయం చేశారంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. దీన్ని వైద్య విధాన పరిషత్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు విధుల్లో చేరని వైద్యుల జాబితాను అధికారులు తయారు చేశారు. ఆ జాబితాలోని వైద్యుల పేర్ల పక్కన ప్రత్యేక కాలమ్‌లో పైరవీ చేస్తున్న మంత్రి లేదా ప్రజాప్రతినిధి పేర్లను అధికారులు తయారు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment