
పీపీఈ కిట్ ధరించడంతో వచ్చిన బబుల్స్ ,పీపీఈ కిట్లు ధరించిన నర్సింగ్ సిబ్బంది
కంటికి కనిపించని ప్రాణాంతక కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని తమను తాము కాపాడుకుంటూ బాధిత రోగులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యులు,సిబ్బంది ధరిస్తున్న పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) దుస్తులు అత్యంత కీలకం.పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతతోపాటు గంటల తరబడి పీపీఈలు ధరించినపలువురు వైద్యులు, సిబ్బంది పలు రకాల రుగ్మతలకు గురవుతున్నారు.
గాంధీఆస్పత్రి: పీపీఈలు ధరించకుంటే కరోనా వైరస్ తమను కాటేస్తుందోననిభయాందోళన వ్యక్తం చేస్తూనే తప్పనిసరి పరిస్థితుల్లో రక్షణ దుస్తులు ధరిస్తున్నారు. డీహైడ్రేషన్, దురద, చెమట పొక్కులు, బబుల్స్ వంటి చర్మవ్యాధులతోపాటు మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. మరికొంత మందిలో తలపై జుట్టు ఊడిపోతోంది.కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సుమారు రెండు వేల మంది వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్, శానిటేషన్, అంబులెన్స్ సిబ్బంది, లిఫ్ట్ ఆపరేటర్, పేషెంట్ కేర్ టేకర్‌తోపాటు పోలీస్ సిబ్బంది కరోనా విధులు నిర్వహిస్తున్నారు.వీరంతా తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాల్సిందే. వీరిలో పల్మనాలజీ, జనరల్‌మెడిసిన్ వంటి ఫ్రంట్ లైన్ వైద్యులు, జూనియర్ డాక్టర్లు, ఇంటర్నీస్, హౌస్ సర్జన్లతోపాటు నర్సింగ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి 8 నుంచి 12 గంటల పాటు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారు. పీపీఈ కిట్లలో తల నుంచి కాళ్ల వరకు శరీరమంతటినీ పూర్తిస్థాయిలో కప్పి ఉంచే ఏడు రకాల రక్షణ దుస్తులుంటాయి.
ఇవీ సమస్యలు.. పరిష్కారాలు..
ఉక్కపోతకు తోడు గంటల తరబడి శరీరమంతటినీ కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించడంతో మూడు రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు వైద్యనిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా డీహైడ్రేషన్‌తోపాటు చర్మ సమస్యలు, మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని వివరించారు. డీహైడ్రేషన్ సమస్య పరిష్కరించేందుకు ఎక్కువగా నీరు తాగాలని సూచించారు. ఓఆర్‌ఎస్ ద్రావణంతోపాటు కొబ్బరి నీళ్లు తగిన మోతాదులో తీసుకోవాలని వివరించారు. సున్నితమైన శరీరతత్వం(సెన్సిటివ్) ఉన్నవారు తప్పనిసరిగా మాయిశ్చరైజర్లు వాడాలని, చర్మం పొడిబారడం, దురద, శరీరంపై నీటిపొక్కులు కనిపిస్తే సంబంధిత చర్మవ్యాధి వైద్యుల సలహా, సూచనల మేరకు వైద్యసేవలు పొందాలన్నారు. డ్యూటీకి వచ్చే ముందే మానసికంగా సన్నద్ధం కావాలని, బలవర్థకమైన ఆహారం తీసుకోవాలని, ఎక్కువ నీళ్లు తాగాలని వైద్యనిపుణులు సూచించారు. మానసిక, శారీరక రుగ్మతలు దూరం కావాలంటే ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా అవసరమని, వ్యాయామం లేదా యోగా వంటివి నిత్యం సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
పోషక పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి
పీపీఈ కిట్లు ధరించి వైద్యసేవలు అందించేవారు అనేక రకాల రుగ్మతలు, సమస్యల బారిన పడుతున్నారు. వీరు పోషక పదార్థాలు ఉన్న ఆహారం, ఎక్కువ నీళ్లతోపాటు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారంతా పీపీఈ కిట్లు ధరించే ముందు మాయిశ్చరైజర్లు శరీరానికి రాసుకోవాలి. శరీరం తాజాగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. చర్మవ్యాధులకు గురైతే తక్షణమే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. – కటకం భూమేష్‌కుమార్, చర్మవ్యాధి నిపుణుడు
ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచాం
ఉక్కపోతకు తోడు శరీరాన్ని కప్పిఉంచే పీపీఈ కిట్లతో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనట్లు గుర్తించాం. వైద్యులు, సిబ్బంది కోసం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్ మంచినీళ్లు అందుబాటులో ఉంచాం. స్వీయరక్షణ కోసం తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించే వైద్యసేవలు అందించాలి. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది, రక్షణ దుస్తులు ధరించకుంటే ప్రాణాలకే ప్రమాదం. డీహైడ్రేషన్, కాళ్లు గుంజడం, దురద, నీటిపొక్కులు వంటి చర్మవ్యాధులకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని, పనిగంటలు తగ్గించేందుకు ప్రయోగాత్మకంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment