ముంచుకొస్తే.. ముందుంటారు | DRF Teams For Disasters in Hyderabad | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తే.. ముందుంటారు

Published Sat, Apr 27 2019 7:38 AM | Last Updated on Wed, May 1 2019 11:32 AM

DRF Teams For Disasters in Hyderabad - Sakshi

కూలిన చెట్టును తొలగిస్తున్న డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంభవించిన విపత్తుల నివారణలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌) కీలక పాత్ర పోషిస్తోంది. గత రెండు రోజుల క్రితం ఈదురు గాలులతో కూడిన ఆకస్మిక వర్షాలకు కూలిన 630 చెట్లను రికార్డ్‌ స్థాయిలో తొలగించడం, రోడ్లపై ఏర్పడిన నీటిని తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చేయడంతో పాటు కూలిన విద్యుత్‌ స్తంభాలు, ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్‌ లైట్‌ టవర్‌ను తొలగించడం వంటి చర్యల ద్వారా జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ దేశంలోని ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచింది. ముంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ తర్వాత విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగం కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోనే ఏర్పాటైంది.

దాదాపు 220 మంది సిబ్బందితో 8 బృందాలు నగరంలోని 24 కీలక ప్రాంతాల్లో మూడు షిఫ్ట్‌లుగా విధి నిర్వహణలో ఉంటాయి.  ఈ నెల 22న అరగంట వ్యవధిలోనే 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన అకస్మిక వర్షం కురియడంతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో ఉన్న విపత్తుల నివారణ బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లను, తెగిపడిన విద్యుత్‌ తీగలు, స్తంభాలను వెంటనే తొలగించాయి. ఈ వర్షాల సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం కంట్రోల్‌ రూంకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 130కి పైగా ఫిర్యాదులు అం దాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ 36 గంటల్లోనే పరిష్కరించడంతో పాటు దాదాపు 622 కూలిన చెట్లను తొలగించారు.

మచ్చుకు కొన్ని..
రామంతాపూర్‌లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉన్న పెద్ద రావిచెట్టు కూలింది. అత్యంత పురాతన ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం పైన, గుడిపైన చెట్ల కొమ్మలు పడకుండా అత్యంత జాగ్రత్తగా కూలిన వక్షాన్ని డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలు తొలగించాయి.
ఆడిక్‌మెట్‌ రామాలయంలో ఉన్న 40 ఏళ్ల చెట్టు సైతం కూలడం, ఈ కూలిన వృక్షాన్ని దేవాలయానికి గానీ, పరిసర ప్రాంతాల ఇళ్లపై కానీ పడకుండా సురక్షితంగా తొలగించారు.
లక్డికాపూల్‌లోని కేన్సర్‌ ఆసుపత్రి వద్ద భారీ వృక్షం కూలి రెండు ప్రధాన రహదారులను బ్లాక్‌ చేయడంతో ఫిర్యాదును అందుకున్న వెంటనే డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఘటనా స్థలానికి చేరుకొని అతితక్కువ సమయంలో కూలిన చెట్లను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు.

సుశిక్షితులైన టీం
జీహెచ్‌ఎంసీలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఏర్పాటై కేవలం సంవత్సర కాలంలోనే ఈ విభాగంలోని 220 మంది సిబ్బందికి విపత్తుల నిర్వహణలో సుశిక్తులుగా చేయడంతో నగరంలో ఏవిధమైన విపత్తులు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కునే ఫోర్స్‌ జీహెచ్‌ఎంసీ కలిగి ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. విపత్తులను ఎదుర్కోవడానికి కావాల్సిన అత్యాధునిక మిషనరీ, టూల్స్‌లను కూడా సేకరించుకోవడం జరిగిందని, ఈ విపత్తు నివారణ బంద సభ్యుల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్టు విశ్వజిత్‌ తెలియజేశారు. హైదరాబాద్‌ నగరంలో ఎలాంటి సంఘటనలైనా ఎదుర్కునేందుకు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సిద్ధంగా ఉందనే ధైర్యం నగరవాసుల్లో ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా 22న ఏర్పడిన భారీ వర్షాలకు డి.ఆర్‌.ఎఫ్‌ బందాలు అందించిన సేవలపై పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజానీకం ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్‌ తదితర సోషల్‌ మీడియా వేదిక ద్వారా ప్రశంసలు కురిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement