ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ వద్ద తాగునీటి కోసం క్యూకట్టిన ప్రజలు
సాక్షి, పెద్దపల్లి: ముత్తారం మండలం సీతంపేటలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బావులు ఎండిపోయాయి. ఫలితంగా గ్రామంలో తాగునీటి ఎద్దడి మొదలైంది. తప్పనిపరిస్థితుల్లో వ్యవసాయ బావులపై ప్రజలు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కష్టమైనా కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారు. పారుపల్లి పంచాయతీ పరిధిలోని శాలగుండ్లపల్లిలో నీటిసరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముత్తారం–కూనారం డబుల్ రోడ్ నిర్మాణ పనుల్లో పైప్‌లైన్ పగిలిపోవడంతో, నీటి సరఫరా నిలిచిపోయింది. నెలలు గడుస్తున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా ప్రజలు నానా పాట్లు పడుతున్నారు.
వేసవి ప్రారంభంలోనే జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలకు కొన్ని ఉదాహరణలివి. ఉన్న మంచినీటి పథకాల నిర్వహణలో లోపం, అంతా మిషన్ భగీరథపైనే ఆధారపడడం, తాత్కాలిక సమస్యలను కూడా పరిష్కరించకపోవడం, షరామామూలుగానే అధికార యంత్రాంగం ముందుగా∙ మేల్కొనకపోవడం కారణంగా, వేసవి ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాకముందే ప్రజానీకం తాగునీటి ఇక్కట్లను ఎదుర్కొంటోంది. మార్చి మొదటివారంలో మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లందిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మిషన్ భగీరథ పనుల్లో విపరీతమైన జాప్యం, అప్పుడే తాగునీటికి ఇబ్బందులు ఎదురవడంతో చూస్తుంటే, భవిష్యత్ జిల్లా ప్రజానీకాన్ని భయపెడుతోంది.
అడుగంటిన జలాలు
జిల్లాలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి అప్పుడే మొదలైంది. మంథని, ముత్తారం, పాలకుర్తి, అంతర్గాం, రామగుండం తదితర మండలాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీనితో తాగునీటి కోసం ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఆయా గ్రామాల్లో బోర్లు, బావులు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో తాగునీటి ప్రధాన పైప్‌లైన్‌లు పగిలిపోతున్నాయి. వాటిని సరిచేసే నాథుడే లేకపోవడంతో, సంబంధిత గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయి, రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. చాలా గ్రామాల్లో ట్యాంకులు నిర్మించినప్పటికీ తాగునీటి కనెక్షన్లు ఇంకా ఇవ్వలేదు.
అంతర్గాం మండలం ముర్మూరు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలనీ నిర్మించే సమయంలో పైపులైన్లు అమర్చినప్పటికీ ఆ తర్వాత ఇళ్లను చాలా ఎత్తులో నిర్మించడంతో ఆ పైపులు లోతుకు వెళ్లిపోయాయి. దీంతో కనెక్షన్లను ఇవ్వలేని స్థితి ఏర్పడింది. దీంతో వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి నీళ్లను క్యాన్లలో తెచ్చుకుంటున్నారు. రామగుండం పట్టణంలోని ఎస్టీ కాలనీకి మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఎన్టీసీపీ ఏరియాలోని ఇందిరమ్మకాలనీ, పీకే రామయ్య కాలనీల్లో ట్యాంకుల ద్వారా కార్పొరేషన్ నీటిని సరఫరా చేస్తోంది. అయినా అవి సరిపోకపోవడంతో చాలా మంది మేడిపల్లి సెంటర్‌లో ఎన్టీపీసీ మినరల్ వాటర్‌ప్లాంట్ వద్దకు వచ్చి క్యాన్లలో నీళ్లను తీసుకెళుతున్నారు. గోదావరిఖని మార్కండేయకాలనీలోని నగునూరి గడ్డ ప్రాంతానికి ఇప్పటికీ తాగునీటి వసతి లేకపోవడంతో సమీపంలో ఉన్న పైపులైన్ల వద్ద గల నల్లాల నుంచి నీటిని తీసుకెళ్తున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది.
భగీరథ జాప్యం
ఇంటింటికి నల్లానీళ్లు అందివ్వాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పనులు జిల్లాలో ఆలస్యంగా సాగుతున్నాయి. మిషన్ భగీరథ పూర్తి చేయడానికి ఇంకా గడువు ఉన్నా.. ప్రధాన పైప్‌లైన్‌లు పూర్తిచేసి వచ్చే మార్చి మొదటి వారంలో గ్రామాలు, పట్టణాలకు బల్క్‌గా నీళ్లందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ శ్రీదేవసేన సైతం మార్చి మొదటి వారంలో నీళ్లందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పనుల ‘తీరు’ను పరిశీలిస్తే, మార్చి మొదటి వారంలో నీళ్లందించడం కష్టంగానే ఉంది.
ఇప్పటివరకు ప్రధాన పైప్‌లైన్ పూర్తికాలేదు. మరో 34 కిలోమీటర్ల మేర పూర్తిచేయాల్సి ఉంది. అలాగే ఇంట్రావిలేజ్ పనుల ప్రగతి చాలా దారుణంగా ఉంది. స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ కూడా గురువారం జరిగిన సమీక్షలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 1664 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 292.84 కిలోమీటర్లు మాత్రమే వేశారు. అలాగే 292 ఓవర్ హెడ్ ట్యాంకులకు గాను, 195 ట్యాంక్‌లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. రామగుండం, పెద్దపల్లి పట్టణాల్లో 180 కిలోమీటర్లకు గాను కేవలం 32 కిలోమీటర్లు మాత్రమే పైప్‌లైన్ పూర్తయింది. మిషన్‌భగీరథ పనులు ఇలా ఉంటే, జిల్లాలో ఇప్పటికే తాగునీటి
ఎద్దడి మొదలైంది. రోడ్డెక్కుతున్న మహిళలు
వేసవి కాలం మొదట్లోనే తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కుతున్నారు. నీళ్లు కావాలంటూ జిల్లాలో ఆందోళనలు సాగుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఓ చోట భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయి, మరో చోట పైప్‌లైన్‌లు పగిలిపోయి..కారణాలేవైనా మొత్తానికి నీళ్లకు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పరిస్థితి కనిపిస్తున్నా అధికారుల తీరులో మార్పు లేదు. వేసవికి ముందే మేల్కొనాల్సిన అధికారులు షరామామూలుగానే వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి.
గత వర్షాకాలం జిల్లాలో లోటు వర్షాపాతం నమోదు కావడం, ప్రస్తుతం భూగర్భజలాలు వేగంగా అడుగంటిపోతున్నా సంబంధిత అధికారులు తీసుకున్న ముందస్థు చర్యలు లేవు. మిషన్ భగీరథ ద్వారానే నీళ్లు అందించేందుకు సిద్దమవుతున్నా, చాలా ప్రాంతాల్లో పైప్‌లైన్ వ్యవస్థ సరిగాలేదు. ట్యాంక్‌లు అందుబాటులో లేవు. సకాలంలో పనులుపూర్తవుతాయన్న నమ్మకమూ లేదు. ఇప్పటికప్పుడు ఎదురవుతున్న తాగునీటì ఎద్దడి నివారణకు ప్రత్యామ్నయ చర్యలు లేవు. తాగునీటి సరఫరా మెరుగు పరచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించకపోతే రాబోయే రోజుల్లో సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
నీటి ఎద్దడి నెలకొందన్న సమాచారం అందుకోవడంతోనే అక్కడ తాత్కాలికంగా చర్యలు తీసుకొంటున్నాం. గతంలో బావులు అద్దెకు తీసుకొని ట్రాకర్లు, పైప్‌ల ద్వారా నీటిని సరఫరా చేసేవాళ్లం. ఇప్పుడు మిషన్ భగీరథ గ్రిడ్‌ల నుంచే నీళ్లు పంపించాల్సి ఉంటుంది. మార్చి మొదటి వారం నాటికి నీళ్లు అందుతాయి. –తిరుపతిరావు, ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్
Comments
Please login to add a commentAdd a comment