తాగి నడిపితే ఇక అంతే.. | Drunk And Drive Tests on ORR Hyderabad | Sakshi
Sakshi News home page

తాగి నడిపితే ఇక అంతే..

Published Fri, May 17 2019 9:02 AM | Last Updated on Mon, May 20 2019 11:26 AM

Drunk And Drive Tests on ORR Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లో వాహన చోదకుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల గణాంకాలు తీసుకుంటే దాదాపు 700 వరకు డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. ఒకవైపు ఎన్నికల బందోబస్తు చేస్తూనే మరోవైపు వీలుచిక్కినప్పుడల్లా ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక
డ్రైవ్‌లు చేపట్టి మందుబాబుల ఆట కట్టించారు. అయితే ఓఆర్‌ఆర్‌లో నెలకు ఐదు నుంచి పదిసార్లు సమయంతో నిమిత్తం లేకుండా డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించి ప్రమాదరహిత రహదారిగా మార్చాలని ఇరు కమిషనరేట్ల అధికారులు నిర్ణయించారు. మద్యం తాగి ఓఆర్‌ఆర్‌పై వాహనంతో నడిపితే తప్పనిసరిగా దొరికిపోయేలా పక్కా వ్యూహన్ని అమలుచేయనున్నారు. ప్రస్తుతం రెండు కమిషనరేట్ల పరిధిలో నేరాలను నియంత్రించడంలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో కార్టన్‌సెర్చ్‌ నిర్వహిస్తూ నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూ నేర నియంత్రణ చేస్తున్న పోలీసులు అదే వ్యూహంతో ఓఆర్‌ఆర్‌పై డ్రంకన్‌ డ్రై వ్‌ తనిఖీలతో రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పెట్టాలని యోచిస్తున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలోని 158 కిలోమీటర్ల పరధిలో ని ఓఆర్‌ఆర్‌పైనా గత మూడేళ్లలో 358 రోడ్డు ప్రమాదాలు జరిగి 110మంది మృతిచెందారు. వందలమంది క్షతగాత్రులయ్యారు.

వేగం తగ్గించినా మారని తీరు
గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆ వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ రెండేళ్ల క్రితం నోటిఫికేషన్‌ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్‌ జోష్‌ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్‌ రోడ్డు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడి అసువులు బాస్తున్నారు. ఈ అతి వేగం ఉన్న సమయంలో సేఫ్టీ మేజర్స్‌ కూడా పనిచేయడం లేదు. ఓఆర్‌ఆర్‌ నిర్వహణను చూస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనచోదకులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది.

అతివేగం వల్ల జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల్లో మృతుల శరీరభాగాల చెల్లాచెదరుగా పడి ఉండటంతో గుర్తు పట్టడం కూడా ఒకానొక సమయంలో పోలీసులకు కష్టమవుతోంది. ఈ అతివేగానికి చెక్‌ పెట్టడానికి స్లో స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చినా వాహనదారులు మాత్రం చలాన్లు కడుతున్నారు గానీ వేగాన్ని మాత్రం తగ్గించుకోవడం లేదు. ఈ అతివేగానికి కారణం కొన్ని సందర్భాల్లో మద్యం సేవించి వాహనం నడపడమేనని పోలీసుల విచారణలో తేలింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు గత మూడునెలల్లో 700 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేశారు. సైబరాబాద్‌లో 642 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు, రాచకొండలో 58 కేసుల వరకు నమోదుచేశారు. అయితే రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కువగా ఎన్నికల బందోబస్తు, ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల బందోబస్తుతో అనుకున్న స్థాయిలో ఓఆర్‌ఆర్‌లో డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టలేదని చెబుతున్నారు. అదే సమయంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గిందని అంటున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement