సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డుపై మందు బాబులు యథేచ్ఛగా దూసుకెళ్తున్నారు. అసలే ఔటర్‌పై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటారు. ఇక ఫుల్‌గా మద్యం సేవించి వాహనం నడిపితే వేగానికి అంతే ఉండదు. ఈ జోష్ ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవర్ల ఆట కట్టించేందుకు శుక్రవారం 300 మంది పోలీసులు ఓఆర్‌ఆర్‌లోని 31 ఎంట్రీల వద్ద మెరుపులా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రాత్రి 8.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో 137 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు పోలీసులకు దొరికిపోయారు. వీరిలో అత్యధిక సంఖ్యలో 90 మంది కారు డ్రైవర్లు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో 41 మంది భారీ వాహన చోదకులు ఉన్నారు. ముగ్గురు ఆటో ట్రాలీ డ్రైవర్లు, ముగ్గురు ద్విచక్ర వాహన చోదకులు కూడా డ్రైవ్‌లో దొరికిపోయారు.
నానక్‌రామ్ గూడ ఎంట్రీ,ఎగ్జిట్ వద్దే ఎక్కువగా...
మామూలుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓఆర్‌ఆర్ మార్గంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. సిబ్బంది కొరతతో కొన్ని ప్రాంతాలకే పరిమితం అవడంతో డ్రంకన్ డ్రైవర్ల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. అది కూడా వారాంతాల్లోనే చేస్తుండటంతో మిగతా రోజుల్లో మందేసి అతి వేగంతో నడుపుతూ కొన్ని సందర్భాల్లో ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు. ఒక్కోసారి తమ తప్పిదాలతోనూ ప్రాణాలు విడుస్తున్నారు. అయితే వాహనదారులు అతివేగంతో దూసుకెళుతున్న దృశ్యాలు స్పీడ్ లేజర్ గన్ కెమెరాలకు చిక్కడంతో అది కూడా శుక్రవారం రోజున ఇవి ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అకస్మాత్తుగా మెరుపు వేగంతో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆర్‌జీఐ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మియాపూర్, జీడిమెట్ల, అల్వాట్ ట్రాఫిక్ పోలీసులు 31 ఎంట్రీ, ఎగ్జిట్‌ల వద్ద వాహనచోదకులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. అయితే నానక్‌రామ్‌గూడ ఎంట్రీ, ఎగ్జిట్‌ల వద్ద అత్యధికంగా 23 మంది కారు డ్రైవర్లు మందు తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. ఓఆర్‌ఆర్‌లో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేకున్నా ముగ్గురు బైకర్లు మద్యం సేవించి నడుపుతూ దొరికిపోయారు. 21 నుంచి 300 వరకు అల్కాహల్ రీడింగ్ రావడం ట్రాఫిక్ పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
హైదరాబాద్‌లో 125 మందికి జైలుశిక్ష...
హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్‌లో మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 125 మందికి రెండు నుంచి 15 రోజుల పాటు ఎర్రమంజిల్‌లోని మూడు, నాలుగో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన 630 మందిపై పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. వీరిలో 125 మందికి జైలు శిక్ష విధించగా, 33 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలల నుంచి రెండేళ్ల పాటు సస్పెండ్ చేసిందని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రవీందర్ శనివారం తెలిపారు. అలాగే సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, చలాన్లు చెల్లించని, డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన 42 మందికి కూడా జైలు శిక్ష పడిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment