ప్రాజెక్టులో మార్పులు చేసే యోచనలో సర్కారు
భూ సేకరణ, విద్యుత్ వినియోగం తగ్గించే వ్యూహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దుమ్ముగూడెం ప్రాజెక్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వచ్చే నీటిని తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేసే విధంగా నిర్ణయం తీసుకునే వీలుంది. ఈ మేరకు ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించాల్సిందిగా అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో దీనిపై పూర్తి నివేదిక సిద్ధంకానుంది. గోదావరి నది నుంచి సుమారు 165 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడానికి వీలుగా దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ర్టంలో గత ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే.
ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద నుంచి నీటిని ఎత్తిపోసి నల్లగొండ మీదుగా నాగార్జునసాగర్ దిగువలోని టెయిల్ పాండ్‌లోకి తరలించే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకోసం సుమారు రూ. 19 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన టెండర్లు కూడా ఖరార య్యాయి. అయితే ఈ ప్రాజెక్టును అప్పట్లోనే తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీగా భూ సేకరణ చేయాల్సి ఉన్నందున రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం పక్కనబెట్టింది.
సామర్థ్యం కొంత తగ్గిస్తే సరి!
రాష్ర్ట విభజనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై తాజాగా దృష్టి పెట్టింది. భూ సేకరణను వీలైనంత తగ్గించి రైతులు ఎక్కువ నష్టపోకుండా ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. అవసరమైతే 165 టిఎంసీలు కాకుండా కొంత తక్కువ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలన్న ఆలోచన చేస్తోంది. దీనివల్ల లిఫ్టులకు అవసరమయ్యే విద్యుత్ కూడా తగ్గుతుందని సర్కారు యోచిస్తోంది.
తెలంగాణలో మూడు ప్రాజెక్టులు వరద నీటిపై ఆధారపడి ఉన్నాయి. నెట్టెంపాడు(22 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), ఏఎమ్మార్పీ (30 టీఎంసీలు) ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. అంటే ఈ మూడు ప్రాజెక్టులకు సుమారు 77 టిఎంసీల నీరు అవసరం. అంటే దుమ్ముగూడెం ప్రాజెక్టును 80 టిఎంసీలకు లేదా వంద టీఎంసీలకే పరిమితం చేస్తే ఖర్చు తగ్గడంతో పాటు భూ సేకరణ సమస్యను కూడా తగ్గించవచ్చని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.
ఈ నీటితో కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైన నీరు కూడా లభ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. నాగార్జునసాగర్ పరిధిలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో(ఎడమ కాల్వ కింద) 6.58 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందుకోసం కృష్ణా జలాల్లో తెలంగాణకు 105 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. దుమ్ముగూడెం నుంచి టెయిల్ పాండ్‌కు తీసుకువచ్చే గోదావరి నీటిని ఈ ఆయకట్టుకు ఉపయోగించుకుని కృష్ణా నదిలోని నికర కోటా జలాలను ఎగువ ప్రాంతంలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు వాడుకోవాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది.