సాక్షి, హైదరాబాద్: దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం పేర్కొంది. మచిలీపట్నం-సికింద్రాబాద్(07049/07050) రైలు ఈ నెల 21న మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.05కు బయలు దేరి రాత్రి 10.45కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు రాత్రి 11.55కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 9.35కు మచిలీపట్నం చేరుకుంటుంది. సికింద్రాబాద్- నర్సాపూర్(07260) రైలు ఈ నెల 19న రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 7కు నర్సాపూర్ చేరుకుంటుంది. విజయవాడ-సికింద్రాబాద్ రైలు(07207) 18న రాత్రి 10కి విజయవాడలో బయలుదేరుతుంది. పలు రైళ్లు రద్దు: విజయవాడ-తిరుపతి (07047) ప్రత్యేక రైలు ఈ నెల 18వ తేదీన, తిరుపతి-అనకాపల్లి(07145) ప్రత్యేక రైలు ఈ నెల 19న రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
‘పెరిగిన ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలు’
సాక్షి, హైదరాబాద్: దసరా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచింది. సాధారణ రోజుల్లో టిక్కెట్ ధర రూ.10 ఉండగా, ప్రస్తుతం రూ.20 కి పెంచారు. పెరిగిన చార్జీలు ఈ నెల 21వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ వంటి ప్రధాన రైల్వేస్టేషన్‌లలో మాత్రమే చార్జీలు పెంచినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో సాధారణంగా ప్రతి రోజు 1.8 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా దసరా రద్దీ దృష్ట్యా ప్రతిరోజు మరో 30 వేల మంది అదనంగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ప్లాట్‌ఫారాలపైన ఒత్తిడి పెరుగుతోందని, దీన్ని నియంత్రించేందుకు తాత్కాలికంగా చార్జీలను పెంచాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. మిగతా స్టేషన్‌లలోనూ రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు.
భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి :దక్షిణ మధ్య రైల్వే జీఎం సూచన
సాక్షి, హైదరాబాద్: సరుకు లోడింగ్ విషయా ల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ అధికారు లకు సూచించారు. ఈ మేరకు సోమవారం రైల్ నిలయంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ రైల్వే డివిజన్ల డీఆర్‌ఎంలతో సమీక్ష నిర్వహించారు. భద్రతా పరమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని, బొగ్గు, సిమెంట్, లైమ్ స్టోన్ తదితర సరుకు లోడింగ్‌లపై ప్రణాళికతో పని చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, రైల్వే స్టేషన్ రీ డెవలప్‌మెంట్, కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద పనుల వేగం పెంచాలన్నారు. సమావేశంలో ఏజీఎం థామస్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ శివప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ రమణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment