సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో నిత్యావసరాలతో పాటు వివిధ పనుల కోసం రోడ్డెక్కుతున్న వాహనదారులకు ‘సైడ్ మిర్రర్’లు వర్రీ కలిగిస్తున్నాయి. సైడ్‌మిర్రర్ లేనివాహనాలకు పోలీసులు ఈ–చలాన్ విధిస్తుండటమే ఈ ఆందోళనకు కారణం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో వాహనదారుల్లో కలవరం మొదలైంది. మోటార్ వెహికల్ యాక్ట్ 177 సెక్షన్ కింద సైడ్ మిర్రర్ లేకుంటే వాహనాలకు విధిస్తున్న ఈ–చలాన్‌పై నగరవాసుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బైక్‌లకు సైడ్ మిర్రర్‌లు ఉండటం వల్ల వెనక నుంచి వచ్చే వాహనాలు కనిపించి జాగ్రత్తగా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుందని, ఈ చలాన్‌లు విధించడం మంచిదే అని కొంతమంది పోలీసుల తీరును సమర్థిస్తున్నారు. తొలుత పూర్తిస్థాయిలో వాహనదారులకు అవగాహన కలిగించాకా ఈ–చలాన్‌లు విధిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మణికొండకు చెందిన వ్యాపారి రామకృష్ణ వ్యక్తం చేశారు. ప్రతిసారి రూ.100ల జరిమానా, రూ.35ల యూజర్ చార్జీలు కలిపి రూ.135లు చెల్లించాల్సి వస్తోందన్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించడంలో భాగంగానే సైడ్ మిర్రర్‌లకు ఈ–చలాన్‌లు విధిస్తున్నామని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment