మత్తయ్యకు భద్రత కల్పించండి | e Supreme Court has directed the Telangana DGP to provide security with Mattayya | Sakshi
Sakshi News home page

మత్తయ్యకు భద్రత కల్పించండి

Published Fri, Nov 23 2018 2:34 AM | Last Updated on Fri, Nov 23 2018 6:49 AM

e Supreme Court has directed the Telangana DGP to provide security with Mattayya - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో జెరూసలేం మత్తయ్యతో మాట్లాడి అతడికి తగిన భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ డీజీపీ భద్రత కల్పించలేదని, తాను కలిసేందుకు వెళ్లినప్పటికీ డీజీపీ నిరాకరించారని మత్తయ్య సుప్రీంకోర్టుకు నివేదించడంతో జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డే, జస్టిస్‌ లావు నాగేశ్వరరావుల ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మె ల్యే స్టీఫెన్‌సన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల పేర్ల నుంచి మత్తయ్య పేరును హైకోర్టు తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టులో 2016లో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని మత్తయ్యను ఆదేశిస్తూ 2017 జనవరి 16న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఈ కేసు గురువారం మరోసారి విచారణకు వచ్చింది. అక్టోబర్‌ 26న విచారణకు వచ్చినప్పుడు మత్తయ్య వాదనలు వినిపిస్తూ తనకు రక్షణ లేదని, ఏపీ పోలీసులు తనను సుప్రీంకోర్టుకు రానివ్వకుం డా అడ్డుకున్నారని ఫిర్యాదు చేయగా ‘మత్తయ్య రక్షణ కోసం చేసుకునే దరఖాస్తును తెలంగాణ డీజీపీ పరిగణనలోకి తీసుకోవాలి..’అని ధర్మాసనం ఆనాడు ఆదేశించింది.  

ఉదయమే నా భార్యను బెదిరించారు.. 
తాజా విచారణలో మత్తయ్య తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ భద్రత కల్పించలేదని, గురువారం ఉదయం కూడా ఏపీ పోలీసులు తన ఇంటికి వెళ్లి భార్యను బెదిరించారని నివేదిం చారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కావాలని తెలంగాణ డీజీపీని కలిసేందుకు ప్రయత్నించినా సానుకూలంగా స్పందించలేదన్నారు. జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డే స్పందిస్తూ.. ‘మేం చెప్పాం కదా.. భద్రత కల్పించడంలో వచ్చిన నష్టమేంటి?’అని తెలంగాణ తరఫు న్యాయవాది హరీన్‌ రావల్‌ను ప్రశ్నించారు. దీనికి రావల్‌ స్పందిస్తూ ‘మత్తయ్యకు హైదరాబాద్‌లో ఎలాంటి బెదిరింపులు, అభద్రత, ప్రాణహాని గానీ లేదు..’అని చెప్పారు.  

ఏపీ, తెలంగాణ పోలీసుల కుమ్మక్కు.. 
అయితే దీనిపై మత్తయ్య స్వయంగా వాదనలు వినిపిస్తూ.. ఓటుకు కోట్లు కేసులో ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులు కుమ్మక్కయ్యారని, ఇద్దరూ కలసి నాటకం ఆడుతున్నారని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు దీనిపై స్పందిస్తూ క్రితం సారి విచారణలో న్యాయవాదితో రావాలని చెప్పామని, న్యాయవాదితో రావాలని సూచించారు. అయి తే తనకు న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేదని విన్నవించడంతో అక్కడే ఉన్న సిద్ధార్థ దవే అనే న్యాయవాదిని ‘మీరు మత్తయ్య తరపున వాదిస్తారా?’అని జస్టిస్‌ నాగేశ్వరరావు ప్రశ్నించగా అందుకు ఆయన సమ్మతించారు. కోర్టు దవేను మత్తయ్య తరఫున వాదనలు వినిపించేందుకు అమికస్‌ క్యూరీ (కోర్టుకు సహాయకారి)గా నియమించిందని, మత్త య్య తన పత్రాలను దవేకు ఇవ్వాలని ఆదేశించారు. మత్తయ్య తానొక మధ్యంతర దరఖాస్తు చేసుకునేం దుకు అనుమతించాలని కోరగా.. ఏదైనా న్యాయ వాది దవే ద్వారా చేసుకోవాలని సూచించారు.  

ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఉదయసింహ 
ఓటుకు కోట్లు కేసులో నిందితుడు ఉదయసింహ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కేసు విచారణను ఆలస్యం చేసేందుకు పిటిషన్లు వేస్తున్నారని తెలంగాణ తరఫు న్యాయవాది రావల్‌ వాదించారు. దీనిపై ఉదయసింహ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇరువురు న్యాయవాదులు వాదులాడుకోగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఉదయసింహ ఇంప్లీడ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు. కేసు తదుపరి విచారణను జనవరి 29కి వాయిదావేసింది. విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉదయకుమార్‌ సాగర్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement