ఎంసెట్‌లో శ్రీచైతన్య నారాయణ రికార్డు
హైదరాబాద్: గురువారం విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో శ్రీచైతన్య నారాయణ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించారని ఆ విద్యా సంస్థల డెరైక్టర్లు సుష్మా, పి.సింధు నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో సాయి సందీప్ మొదటి ర్యాంకు, నిహార్ చంద్ర 2వ, కీర్తన 3వ ర్యాంకు ఇలా టాప్ పది ర్యాంకుల్లో పది ర్యాంకులను, టాప్-25లో 25, టాప్-50లోపు 47 ర్యాంకులను శ్రీచైతన్య నారాయణ విద్యార్థులే కైవసం చేసుకుని నంబర్ వన్‌గా నిలిచారని పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని ఈ సందర్భంగా వారు అభినందించారు.
చరిత్ర సృష్టించిన నారాయణ శ్రీచైతన్య
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో నారాయణశ్రీచైతన్య విద్యార్థులు అత్యంత అద్భుతమైన ఫలితాలు సాధించి, రికార్డు సృష్టించారని ఆ విద్యా సంస్థల డెరైక్టర్లు పి.సింధు నారాయణ, సుష్మా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడిసిన్ విభాగంలో ఉప్పలపాటి ప్రియాంక మొదటి ర్యాంకు, కాడ శ్రీవిధుల్ 2వ, వంగల అనూహ్య 3వ ర్యాంకు ఇలా టాప్ పది ర్యాంకుల్లో పది ర్యాంకులను, టాప్-25లో 24, టాప్-50లోపు 48 ర్యాంకులను నారాయణ శ్రీచైతన్య విద్యార్థులే కైవసం చేసుకున్నారని వారు చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని వారు అభినందించారు.
ఎంసెట్‌లో శ్రీగాయత్రి విజయకేతనం
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో శ్రీగాయత్రి విద్యార్థులు విజయభేరి మోగించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ పీవీఆర్‌కే మూర్తి ఒక ప్రకటనలో వెల్లడించారు. కొత్త రాష్ట్రం తొలి ఎంసెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించి సంచలనం సృష్టించి.. టాప్-10లో నిలిచారని చెప్పారు. ఈ ఘన విజయాలకు తాము ప్రతిష్టాత్మకంగా రూపొందించిన శ్రీగాయత్రి లక్ష్య ఇంటెన్సివ్ ప్రోగామే కారణమని పేర్కొన్నారు. అలాగే జాతీయస్థాయిలో బిట్‌శాట్, క్లాట్ సహా అన్ని పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారన్నారు. ఈ విజయం సాధించిన విద్యార్థులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.
టాప్ లేపిన ఎన్‌ఆర్‌ఐ అకాడమీ విద్యార్థులు
గుంటూరు: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో స్టేట్ టాప్ స్థాయిలో సీట్లు పొందేలా వేలాది ర్యాంకులను ఎన్‌ఆర్‌ఐ అకాడమీ విద్యార్థులు సాధించారని ఆ సంస్థ సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్, డెరైక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 80వ ర్యాంకు, 91వ ర్యాంకు ఇలా.. 7,850కు పైగా సీట్ గెటింగ్ ర్యాంకులను, మెడిసిన్ విభాగంలో 40వ ర్యాంకు, 42, 70.. ఇలా 280కి పైగా సీట్లు పొందగల ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారని చెప్పారు. తమ విద్యా ప్రణాళిక, బోధనా సరళి, అనుభవం గల ఫ్యాకల్టీయే ఈ విజయాలకు కారణమన్నారు. ఈ సందర్భంగా ఎంసెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన తమ విద్యార్థులను, అధ్యాపకులను వారు అభినందించారు.
పావుగంట ముందుగానే ఫలితాలు!
ఎంసెట్ ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించడానికి పావుగంట ముందే ఎంసెట్ వెబ్‌సైట్‌లో వచ్చాయన్న వార్తలు కలకలం రేపాయి. ఇదే విషయాన్ని మంత్రి ముందు ప్రస్తావించగా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఇదేమీ ప్రశ్నాపత్రం కాదు కదా.. ఫలితాలు ఎలాగూ విద్యార్థులకు చేరేవే కదా అని చివరికి పేర్కొనడం గమనార్హం.
ఎంసెట్ వచ్చినా.. ఇంటర్ పోయింది!
వారు ఎంసెట్‌లో ఉత్తీర్ణులు అయ్యారు.. కానీ ఇంజనీరింగ్‌లోనో, మెడిసిన్‌లోనో చేరలేరు.. ఎందుకంటే ఇంటర్‌లోనే ఫెయిలయ్యారు. ఇలాంటి 17,338 మంది విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకులను కేటాయించలేదు. మరో 2,558 మంది విద్యార్థులు ఇంటర్ ఉత్తీర్ణులయ్యారా, లేదా అన్న వివరాలు ఎంసెట్ కమిటీకి అందకపోవడంతో వారికి ర్యాంకులు కేటాయించలేదు. ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ రాసినవారు 13,817 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌లో 6,079 మందికి నిరుత్సాహమే మిగిలింది.
సంక్షేమ గురుకులాల్లో మంచి ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ విద్యార్థులు ఎంసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మెడిసిన్ విభాగంలో పదివేలలోపు ర్యాంకులను పదిమంది విద్యార్థులు సాధించారు. ఐఐటీ గౌలిదొడ్డికి చెందిన ఇద్దరు విద్యార్థులు 2,569, 2,690 ర్యాంకులు సాధించారు. కరీంనగర్ సీడీఈకి చెందిన విద్యార్థి 3,379 ర్యాంకు సాధించాడు. ఇంజనీరింగ్ విభాగంలోనూ గురుకులాల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. పదివేల లోపు ర్యాంకులను 16 మంది విద్యార్థులు సాధించారు. కరీంనగర్ సీడీఈకి చెందిన విద్యార్థి 2,848 ర్యాంకు, ఐఐటీ గౌలిదొడ్డికి చెందిన ఇద్దరు విద్యార్థులు 4,835, 4,933 ర్యాంకులను సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గురుకులాల సొసైటీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు తెలిపారు.
ఎంసెట్‌లో ఎస్టీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులు ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించారు. మెడికల్ విభాగంలో రాజేంద్రనగర్ ఐఐటీ స్టడీసెంటర్‌కు చెందిన లాలూనాయక్ 6,223 ర్యాంకు సాధించాడు. వరంగల్ సీవోఈలో చదువుకున్న ముడావత్ శ్రీకాంత్ 8,443 ర్యాంకు, రాజేంద్రనగర్ సెంటర్‌కు చెందిన కె.అశోక్ 9,782 ర్యాంకు సాధించారు. 10 నుంచి 20 వేల మధ్యలో మరో ఏడుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో రాజేంద్రనగర్ ఐఐటీ సెంటర్‌కు చెందిన చంద్రా 4,407 ర్యాంకు సాధించాడు. 5-10 వేల మధ్య 9 మంది, 10-20 వేల మధ్య 21 మంది ర్యాంకులు సాధించారు. ఆ విద్యార్థులకు మంత్రి అజ్మీరా చందూలాల్ అభినందనలు తెలిపారు.
అసత్య ఆరోపణలు మానుకోవాలి
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఎంసెట్‌లు నిర్వహిస్తే ఏపీ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని చేసిన అసత్య ఆరోపణలను ఇప్పటికైనా మానుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యలో ప్రాంతీయ వివక్ష లేదనడానికి ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడమే నిదర్శనమన్నారు. ఈ ఫలితాలతో ఏపీ రాజకీయ నాయకుల ఆరోపనలు అవాస్తవమని తేలిపోయిందని చెప్పారు. విభజన చట్టం ప్రకారమే ప్రవేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఎంసెట్‌లో రికార్డుల పంట
Published Fri, May 29 2015 2:48 AM | Last Updated on Sat, Aug 11 2018 7:23 PM
Advertisement
Advertisement