
నిధులు స్వాహా
‘ప్రతి వెయ్యి మందిలో 18 మంది బాల్య వివాహాలతో ప్రసూతి మరణాలకు గురవుతున్నారు. ప్రజల్లో మూఢనమ్మకాలను పారదోలినట్లయితే వీటిని అరికట్టవచ్చు.
ఆదిలాబాద్ : ‘ప్రతి వెయ్యి మందిలో 18 మంది బాల్య వివాహాలతో ప్రసూతి మరణాలకు గురవుతున్నారు. ప్రజల్లో మూఢనమ్మకాలను పారదోలినట్లయితే వీటిని అరికట్టవచ్చు. ఇందుకోసం చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. వైద్య ఆరోగ్య శాఖ.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.’ ఇవీ బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్ పేర్కొన్న మాటలు.
అయితే జిల్లాలోని వైద్యాధికారుల తీరు ఇందుకు వ్య తిరేకంగా ఉంది. బాల్యవివాహాలను అడ్డుకోవడానికి చైతన్య కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఎక్కడా అవగాహన సదస్సులు నిర్వహించిందిలేదు. పైగా ఈ నిధులు విడుదలైనట్లు ఆ శాఖ సిబ్బందికి.. బాల్యవివాహాల నిరోధక కమిటీలకు తెలియదు.
చట్టం ఏం చెబుతోంది..
జిల్లాలో బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 ప్రకా రం జిల్లా, డివిజనల్, మండల కమిటీలతోపాటు గ్రా మస్థాయిలో బాల్య వివాహాల నిరోధక, పర్యవేక్షక కమిటీలు పనిచేస్తున్నాయి. అయితే ఈ కమిటీల పనితీరు అంతంతమాత్రంగానే ఉందనే విమర్శలున్నాయి. సమావేశాల నిర్వహణ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో ప్ర భావం చూపడం లేదనే ఆరోపణలున్నాయి. సమన్వయంగా పనిచేస్తూ బాల్య వివాహాలు అడ్డుకోవడానికి మంజూరయ్యే నిధులు సక్రమంగా వినియోగించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. కనీసం ఏ పథకం కింద ఏయే నిధులు ఎంత మొత్తం వస్తున్నాయో కూడా కమిటీలకు తెలియని పరిస్థితి ఉంది.
వైద్య, ఆరోగ్యశాఖలో గతేడాది ‘ఏజ్ ఎట్ మ్యారేజ్’ (పెళ్లి వయసు) పేరిట గ్రామాల్లో చైత న్య కార్యక్రమాల నిర్వహణకు లక్షల రూపాయలు మం జూరయ్యాయి. అయితే ఉన్నతాధికారులు, మెడికల్ ఆఫీసర్లకు మినహా కిందిస్థాయి సిబ్బంది ఎవరికీ ఈ పథకం ఉన్నట్లు తెలియదంటే ఇక ఎలా నిర్వహించారో అర్థమవుతుంది. మహిళ అభివృద్ధి-శిశు సంక్షేమశాఖ(ఐసీడీఎస్), జిల్లా బాలల పరిరక్షణ విభాగం(ఐసీపీఎస్) శాఖలకూ ఈ పథకం ఉన్నట్లు తెలియకపోవడం గమనార్హం.
సబ్‌సెంటర్‌కు రూ.1000
జాతీయ గ్రామీణ ఆరోగ్య సంస్థ(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కిం ద తల్లి, బిడ్డ సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగానే ‘ఏజ్ ఎట్ మ్యారేజ్’ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి గతేడాది ఆదేశాలు వెలువడ్డాయి. జిల్లాలో 72ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ఉండగా వాటి కింద 469సబ్‌సెంటర్లు ఉన్నా యి. ఒక్కో పీహెచ్‌సీ కింద 7 నుంచి 13 వరకు సబ్‌సెం టర్లు ఉన్నాయి. ఒక్కో సబ్‌సెంటర్‌కు రూ.1000 చొ ప్పున మొత్తం రూ.4.70 లక్షలు మార్చి 22న జిల్లాకు మంజూరయ్యాయి. అదే నెల 31న అన్ని పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లకు ఈ నిధులను విడుదల చేశారు.
ఏ ఎన్‌ఎంల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశవర్కర్లు, పీహెచ్‌సీ సిబ్బంది, గ్రామ ప్రముఖులు కలిసి సబ్‌సెంటర్ పరిధిలో ర్యాలీలు నిర్వహించి బాల్య వివాహాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి. ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి. గ్రామంలోని యుక్త వయసు బాలికలతో సబ్ సెంటర్ భవనం లో సదస్సు నిర్వహించి బాల్యం వివాహం చేసుకుంటే ఏర్పడే అనర్థాలను వివరించాలి. అయితే కొన్నిచోట్ల మినహాయించి ఎక్కడా ఈ కార్యక్రమాలు నిర్వహించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మెడికల్ ఆఫీసర్లు నిధులు డ్రా చేసి ఏఎన్‌ఎంలకు ఇవ్వడం ద్వారా కార్యక్రమాలు నిర్వహించేందుకు దోహదపడాలి. అయితే అసలు ఏఎన్‌ఎంలకే ఈ కార్యక్రమం ఉన్నట్లు తెలియకపోవడం గమనార్హం. ఒక్కో పీహెచ్‌సీ పరిధిలో రూ.ఏడు వేల నుంచి రూ.13 వేల వరకు మెడికల్ ఆఫీసర్ల జేబులోకి వెళ్లాయనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు నిధులు విడుదల చేయడం తప్పించి క్షేత్రస్థాయిలో కార్యక్రమం నిర్వహణపై దృష్టి సారించకపోవడంలో వారి మతలబు ఏంటో ఇట్టే అర్థమవుతుంది.