
అత్త సొత్తు అల్లుడు స్వాహా
మోసం చేసి తన ఆస్తినంతా కాజేసిన అల్లుడిని శిక్షించాలని ఓ వృద్ధురాలు న్యాయపోరాటం చేస్తూనే ఉంది.
- ఐదేళ్లుగా వృద్ధురాలి న్యాయపోరాటం
- మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట దీక్ష
కోస్గి: నమ్మించి మోసం చేసి తన ఆస్తినంతా కాజేసిన అల్లుడిని శిక్షించి తనకు న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు గత ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. చచ్చేలోపైన తనకు న్యాయం జరగాలని ఇప్పటికే పలు సార్లు నిరాహార దీక్ష చేసిన బాధిత వృద్ధురాలు శుక్రవారం మరోమారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షకు పూనుకుంది. వివరాలిలా.. మండలంలోని సంపల్లికి చెందిన కొత్తూరు బిచ్చమ్మకు నలుగురు కూతుళ్లు కాగా అందరికీ వివాహాలు జరిగాయి. కాగా మూడో కూతురి వివాహాన్ని అడ్డం పెట్టుకొని మండలంలోని అమ్లికుంట్లకు చెందిన పెద్ద కూతురు ప్రమీళ, అల్లుడు నారాయణరెడ్డి సంపల్లికి వచ్చారు.
వివాహం అయిపోయినప్పటికీ ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో రుణం పేరుతో మాయమాటలు చెప్పి బిచ్చమ్మ పేరుతో ఉన్న భూమిని 1993లో నాలుగు ఎకరాలు, 2011లో మరో మూడెకరాలు తమ కొడుకు పేరున కొన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బిచ్చమ్మ అల్లుడిని నిలదీస్తే ఇంట్లో రూ.1.50 లక్షలు దొంగతనం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసి వృద్ధురాలిని ఆమె సొంత ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.
ఈ నేపథ్యంలో 2012లో గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోగా అప్పట్లో పేట ఆర్డీఓ యాస్మిన్‌బాష వచ్చి న్యాయం చేస్తామని చెప్పడంతో దీక్ష విరమించింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో 2013లో మరోమారు దీక్షకు దిగగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు న్యాయం చేస్తామని స్థానిక రెవెన్యూ అధికారులు సూచించడంతో రెండోసారి దీక్ష విరమించింది. నేటికీ న్యాయం జరగకపోవడంతో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షకు పూనుకోగా అధికారులు ఎవరూ లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ రాఘవేందర్‌కు వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగింది. ప్రాణం పోయినా సరే తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బిచ్చమ్మ కన్నీటి పర్యంతమైంది.