
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితాలో చేర్పులు, తప్పుల సవరణ, పేర్ల తొలగింపు తదితర ప్రక్రియల కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని, కేవలం డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు మాత్రమే సాఫ్ట్‌వేర్ సహాయపడుతుందని ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. తాము ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ తనంతట తాను ఓట్లను తొలగించలేదని, కేవలం ఓటర్ల డేటాబేస్ నిర్వహణకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 22, ఓటరు నమోదు నిబంధనల్లోని 21ఎ నిబంధన ప్రకారం ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, ఓటర్ల తొలగింపు అధికారం కేవలం ఈఆర్‌వోలకు మాత్రమే ఉందని తెలిపింది. సాఫ్ట్‌వేర్ గుర్తించిన డూప్లికేట్ ఓటర్లను క్షేత్రస్థాయిలోని ఓటర్ల జాబితాలతో పోల్చుకుని, చట్ట ప్రకారం అన్ని విచారణలు చేసిన తరువాతనే తొలగింపు విషయంలో ఈఆర్‌వోలు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వెల్లడించింది. ఓటర్ల జాబితాలో తప్పులకు ఆస్కారం లేకుండా స్వచ్ఛంగా ఉండేందుకు ఆధార్‌తో ఓటర్ ఐడీని అనుసంధానించామంది.
ఓటర్ల అంగీకారంతోనే ఈ అనుసంధానం జరిగిందని, ఆ తరువాత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ నెంబర్ల సేకరణను నిలిపేశామని వివరించింది. సాఫ్ట్‌వేర్ సాయంతో ఈఆర్‌వోలు ఓట్లను తొలగిస్తున్నారన్న పిటిషనర్ వాదనలో ఎంత మాత్రం వాస్తవం లేదని, ఎటువంటి ఆధారం లేకుండానే పిటిషనర్ ఈ ఆరోపణ చేస్తున్నారని తెలిపింది. ఓటర్ల జాబితా తయారు సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పులు, చేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ మియాపూర్‌కి చెందిన ఇంజనీర్ కొడలి శ్రీనివాస్ హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం తరఫున డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.సత్యవాణి కౌంటర్ దాఖలు చేశారు. తాము ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో స్వీయ నిర్ణయాలు తీసుకునే విధంగా ఎటువంటి ఆల్గారిథమ్‌గానీ, ఇంటెలిజెన్స్‌గానీ లేదని ఆమె తెలిపారు. ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు సాయపడుతున్న ఓ ఉపకరణమే ఈ సాఫ్ట్‌వేర్ అని వివరించారు. ఈ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన అంతర్గత వివరాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదని, దీని వల్ల సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టును కోరారు.