ఏర్పాట్లు ముమ్మరం | Election Works Are Complete In Adilabad | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లు ముమ్మరం

Published Wed, Nov 28 2018 1:04 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Election Works Are Complete In Adilabad - Sakshi

స్ట్రాంగ్‌రూంలో ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి  

భైంసా(ముథోల్‌): అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు పక్కాగా అమలు పరుస్తున్నారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత అధికారులు, సిబ్బందితో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయి ప్రస్తుతం ప్రచారపర్వం ఊపందుకుంది. ప్రత్యేక బృందాలు అభ్యర్థుల ప్రచారం, ఖర్చులపై నిఘా పెంచాయి. పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేదాకా అధికారులు, సిబ్బందే కీలకం. ఇప్పటికే వారంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.  

కీలకమైన రెవెన్యూ.. 
ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ అధికారులదే ప్రధాన పాత్ర. నియోజకవర్గస్థాయిలో ఆర్డీవో ఎ న్నికల రిటర్నింగ్‌ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయా శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఈయనే ఉంటారు. రాష్ట్రంలో అసెంబ్లీ రద్దుకుముందే పనులు ప్రారంభించారు. ఓటరు నమోదు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, స్క్వాడ్‌ల ఏర్పాటు, ఎన్నికల నియ మావళి ఈ అధికారులే అమలు చేస్తున్నారు. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌ఓలు వారికి కేటాయించిన విధులు నిర్వహిస్తున్నారు. ఆర్‌ఓ నేతృత్వంలోని నాలుగు బృందాలు విధిగా పని చేస్తున్నాయి. పోలింగ్‌కు వారం ముందే ఓటర్లకు పోల్‌చీటీలు అందించాలని వీరు నిర్ణయించారు.
 
దృష్టి సారించిన పోలీసులు.. 
పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శశిధర్‌రాజు వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి నిఘా పెంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. చాలా గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం, డబ్బు రవాణాను అడ్డుకుంటున్నారు. రాజకీయ సభలు నిర్వహించే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
  
టెక్నాలజీ వినియోగం... 
ఈ ఎన్నికల్లో టెక్నాలజీ వినియోగం పెరిగింది. ఎన్నికల అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు చేశారు. నిపుణుల బృందం టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించింది. ఎన్నికల సంఘం సువిధ, సీవిజిల్, సమాధాన్‌ యాప్‌లను వినియోగిస్తున్నారు. పోటీచేసే అభ్యర్థుల నామినేషన్‌తో పాటు అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తున్నారు. ఎన్నికల రోజు వెబ్‌కాస్టింగ్‌ పర్యవేక్షించడం, కౌంటింగ్‌ వివరాలు ఎన్నికల సంఘానికి చేరవేసే వరకు ఐటీ విభాగమే కీలకం కానుంది. ఒక్కో నియోజకవర్గంలో ఇందుకు సంబంధించి 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
 
ఎక్సైజ్‌ అధికారులు... 
ఎన్నికలు అంటేనే అందరికి మద్యం గుర్తుకువస్తుంది. ఈ క్రమంలో అక్రమ మద్యం విక్రయాలు అరికట్టేందుకు ఎక్సైజ్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే బెల్టుషాపులు మూసి వేయించారు. విక్రయాలపై నియంత్రణ విధించారు. మద్యం దుకాణాల నిర్వాహకులకు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా ఆదేశాలు జారీచేశారు. ఎక్సైజ్‌ బృందాలు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు కూడా చేస్తున్నాయి.
 

జిల్లా కేంద్రంలోనే కౌంటింగ్‌... 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండేవి. అప్పట్లో ఎన్నికల కౌంటింగ్‌ ఆదిలాబాద్‌లోనే జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు సైతం ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలైంది. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌ కౌంటింగ్‌ను జిల్లాకేంద్రంలోనే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.    


ఉపాధ్యాయుల పాత్ర... 
ఎన్నికలు సమగ్రంగా నిర్వహించేందుకు ప్రతి సారి ఉపాధ్యాయులనే అధిక సంఖ్యలో తీసు కుంటారు. పోలింగ్‌ అధికారి, ఏపీఓ ఇలా ఎం దులోనైనా ఉపాధ్యాయులే ఎక్కువగా కనిపిస్తారు. ఎన్నికల విధులకు సంబంధించిన ఉ ద్యోగుల జాబితాను విద్యాశాఖ రూపొంది స్తుంది. త్వరలోనే వీరికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈవీఎంలు, వీవీప్యాడ్‌లపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.  
 


వైద్యసేవల్లో ఏఎన్‌ఎంలు... 
పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రాలకు వెళ్లే అధికారులు, సిబ్బంది అనారోగ్యానికి గురైతే సేవలు అందించేందుకు ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచారు. వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు ఆదేశాలు జారీచేసింది. ఆయా కేంద్రాల వద్ద ఈ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించింది. పోలింగ్‌ రోజున ఓటర్లు, సిబ్బంది అనారోగ్యానికి గురైతే ప్రాథమిక చికిత్స అందించనున్నారు. ఈ  కేంద్రాల వద్ద అవసరమయ్యే మందులు కూడా అందుబాటులో ఉంచనున్నారు.  
 


గ్రామ అధికారులే... 
నిర్మల్‌ జిల్లావ్యాప్తంగా గ్రామాలే అధికంగా ఉన్నాయి. అన్ని గ్రామాల్లోనూ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ తదితర వసతుల కల్పనను గ్రామస్థాయి అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఆరు పోలింగ్‌ కేంద్రాలకు కలిపి ఒక సెక్టోరియల్‌ అధికారిని నియమించారు. ఆయా కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించారు. వీఆర్‌ఓలు, బీఎల్‌ఓలు అక్కడి పరిస్థితులను తెలుసుకుని గ్రామ కార్యదర్శులతో కలిసి ఏర్పాట్లను చూస్తున్నారు.
 


సర్వం సిద్ధం 


అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి చేరిన ఎన్నికల సామగ్రిని నిమోజకవర్గాల వారీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలకు, అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యాలయాలకు పంపిణీ చేసే చర్యలను చేపడుతున్నారు.

స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచిన ఈవీఎంలు                        కలెక్టరేట్‌లో ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్న సిబ్బంది

  ఇందులో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ఓటరు నమోదు పత్రాలను బూత్‌ల వారీగా సిద్ధం చేసి ఆయా మండలాలకు పంపిస్తున్నారు. అలాగే బ్యాలెట్‌ పత్రాలను సైతం సిద్ధం చేశారు. అధికారులు ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో బిజీగా మారిపోతున్నారు.         

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement