‘వర్సిటీ’ పేరిట వంచన | The emergence of new things in Santosh Roy case | Sakshi
Sakshi News home page

‘వర్సిటీ’ పేరిట వంచన

Published Tue, Jul 3 2018 2:08 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM

The emergence of new things in Santosh Roy case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడిసిన్‌ సీట్లు ఇస్తానంటూ అనేక మంది వైద్యులను నిండా ముంచిన సూడో డాక్టర్‌ సంతోష్‌ రాయ్‌ కేసు దర్యాప్తులో కొత్త విష యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఇతనితో పాటు సహచరుడైన మనోజ్‌కుమార్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. దాదాపు 16 ఏళ్లుగా మోసాలు చేస్తున్న సంతోష్‌ వ్యవ హారాలకు నాంది ఢిల్లీలోనే పడింది. 2002లో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీని ఏర్పాటు చేసి పలు కోర్సుల పేర అడ్మిషన్లంటూ మోసాలకు తెరలేపాడు. కొన్ని వైద్య సంబంధ కోర్సుల్నీ ప్రవేశపెట్టాడు.

అప్పట్లో 30 మంది నుంచి రూ.9 కోట్ల వరకు వసూలు చేసి జైలుకెళ్లాడు. అయినా మోసాలు కొనసాగిస్తూ ముఠాల ఏర్పాటుతో వ్యవస్థీకృత పంథాలోకి మారాడు. ఇటీవల సంతోష్‌పై 2 కేసుల్ని సైబర్‌ క్రైమ్‌ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. నగరానికి చెం దిన డాక్టర్‌ ఫాతిమా కుమార్తెకు పీజీ మెడిసిన్‌ సీటు పేరుతో రూ.81 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు సిటీలో ఉండగా, ఢిల్లీలో రాజేంద్రనగర్‌కు  చెందిన మరో వ్యక్తి నుంచి రూ.68 లక్షలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించాడు. ఇతని అరెస్టుని మీడియా ద్వారా తెలుసుకున్న ఇద్దరు బాధితులు సోమవారం బయటకు వచ్చారు.

వైజాగ్‌ కి చెందిన ఓ డాక్టర్‌ తన నుంచి రూ.65 లక్షలు తీసుకున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తెలపడంతో అక్క డి ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు. బెంగళూరు నుంచి వచ్చి సిటీలో ఉద్యోగం చేస్తున్న మరో వైద్యుడు సైతం సైబర్‌ క్రైమ్‌ ఠాణాను సంప్రదించాడు. సంతోష్‌ అండ్‌ గ్యాంగ్‌ తన నుంచి రూ.40 లక్షలు తీసుకున్నట్లు వాపోయాడు. దీనిపై బెంగళూరులో కేసు నమోదు కానుంది. ఈ రెండు కేసుల్లో అక్కడి పోలీసులు సంతోష్‌ తదితరుల్ని పీటీ వారంట్‌పై అక్కడకు తరలించే అవకాశం ఉంది.  

బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీగానే...
ఈ గ్యాంగ్‌ ఒక్కొక్కరి నుంచి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసింది. సాధారణంగా ఇంతటి భారీ మొత్తాలను మోసగాళ్లు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకోవడమో, ట్రాన్స్‌ఫర్‌ చేయించడమో చేస్తుంటారు. కానీ వీరు బ్యాంక్‌ ఖాతాల జోలికిపోలేదు. వాటిని వాడితే పోలీసులకు ఆధారాలు లభిస్తాయనే ఉద్దేశంతో నగదు మాత్రమే తీసుకునేవారు.

ఇతన్ని అరెస్టు చేసిన పోలీసులు 11 బ్యాంకు ఖాతా లను గుర్తించి ఫ్రీజ్‌ చేశారు. వీటిలో ఒక్క ఖాతాలోనే రూ.3 లక్షలు ఉన్నట్లు తేలింది. బాలీవుడ్‌ నిర్మాత అయిన సంతోష్‌ ఆ రంగంలో పెట్టుబడులు పెట్టి ఉం టాడన్న కోణంలోనూ అధికారులు దృష్టి పెట్టారు. ఈ సూడో గ్యాంగ్‌ కొన్ని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఈడీ సహా ఇతర సంస్థలు దర్యాప్తు చేస్తు న్న ఆర్థిక నేరాల వివరాలు సంతోష్‌కు తెలిసేవి.

అందులోని నిందితులతో సంప్రదింపులు జరిపి ఆయా కేసుల్ని సెటిల్‌ చేయిస్తానని లేకుంటే త్వరలో కఠిన చర్యలు తప్పవని బెదిరించేవాడు. ఈ కోవకు చెందిన బాధితుల్లో సిటీకి చెందిన వారూ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు ప్రాధాన్యత, పరిధి దృష్ట్యా లోతుగా విచారించడానికి సంతోష్‌ను 10 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement