సాక్షి, సిటీబ్యూరో : రాత్రి సరిగా నిద్ర పట్టకున్నా పొద్దున్నే లేవక తప్పదు. బ్రేక్‌ఫాస్ట్ తిన్నామనిపించి, బస్సులో, ఆటోలో, టూ వీలరో, ఫోర్ వీలరో.. రోడ్డుపైకి ‘జామ్’జాటంలో అభిమన్యుడి వారసులను తలదన్నుతూ.. ఆఫీసుకు వెళ్లిన నాటి కష్టాలకు తెరపడనుందా..? దశలవారీగా పలు కార్యాలయాలు అంతరించనున్నాయి. ఆవాసాలే ఆఫీసులుగా అవతరించనున్నాయి. కరోనా వైరస్ పరిస్థితులతో తప్పనిసరిగా మారిన వర్క్ ఫ్రం హోమ్‌ను కంపెనీలు జూలై నెలాఖరు వరకూ పొడిగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కల్చర్ కార్పొరేట్ ఉద్యోగి రేపటి భవిష్యత్‌ను మార్చనుంది. ఈ అంచనాలకు ఫోర్బ్స్ సర్వే ఫలితాలు సైతం ఊతమిస్తున్నాయి.
మంచం దిగకుండానే కాఫీ.. అంటూ ఆర్డరేసి, అది సిప్ చేస్తూనే కంప్యూటర్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ పనిలోకి దిగిపోవడం, విసుగొస్తే ఆపేసి ఆటో.. పాటో.. నిద్రో మరొకటో.. ఇలా ఇష్టమొచ్చినప్పుడల్లా బ్రేక్స్.. ఒక చేత్తో మౌస్ పట్టుకుని మరో చేత్తో ఒళ్లోని పిల్లాడ్ని ఆడిస్తూ పనిచేయడం.. కలలో కూడా ఊహించలేని వర్క్ ఫ్రం హోమ్ ఇప్పుడు నగరవాసుల అనుభవంలోకి వచ్చేసింది. అయితే ఇది పూర్తిగా కొత్తదేం కాదు. కొంత కాలంగా సిటీలో కొన్ని సంస్థలు అవసరాన్ని బట్టి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని అందిస్తూనే ఉన్నాయి. అయితే సాంకేతికంగా దీన్ని రిమోట్ వర్కింగ్ సిస్టమ్‌గా పేర్కొంటున్నారు.
హ్యాపీ హోమ్..
ఇటీవల ఫోర్బ్స్ మేగజైన్ చేసిన సర్వే ప్రకారం రిమోట్ వర్కర్స్ ఆఫీసులో పనిచేసేవారి కంటే సమర్థవంతంగా, సంతోషంగా పనిచేయగలరని తేలింది. విభిన్న రకాల మార్గాల్లో పనిచేస్తున్న దాదాపు 2లక్షల మంది జాబితాను తీసుకుని చేసిన ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆఫీసులో కూర్చుని లేదా ఇతర మార్గాల్లో పనిచేస్తున్న వారితో పోలిస్తే సంతోషపు స్థాయి కూడా రిమోట్ వర్కర్స్‌కే ఎక్కువట. వీరి సంతోషపు స్థాయి సగటు 10కి 8.10 ఉంటే, మిగిలిన మార్గాల్లో పనిచేస్తున్న అందరి సగటూ 7.42 ఉందట. సర్వేలో పాల్గొన్న వారిలో 91శాతం మంది తాము రిమోట్ వర్కర్స్‌గా మారడం వల్ల ఆఫీసులో ఉండి చేసే పనికన్నా ఎక్కువ పని చేయగలుగుతున్నామని చెప్పారు. గతంలో హార్వర్డ్ బిజినెస్ చేసిన రివ్యూ స్టడీలో రిమోట్ వర్కర్స్ తక్కువ విరామాలు తక్కువ అనారోగ్య సెలవులు తీసుకుంటారని తేలింది.
లాభాలెన్నో.. లోపాలూ అన్ని..
నగరాల్లో ఇంటి నుంచి ఆఫీసుకు మధ్య రాకపోకలకు అయ్యే సమయం, తద్వారా వచ్చే సమస్యల నివారణ వర్క్ ఫ్రం హోం వల్ల కలిగే తొలి ప్రధాన లాభం అని చెప్పాలి. తమ పనితీరును తరచూ ఇతరులతో పోల్చి చూసుకోనక్కర్లేకుండా, బాస్ నిరంతర ఆజమాయిషీని తప్పించుకోవడం వల్ల మరింత స్వేచ్ఛగా, ధైర్యంగా పనిచేసుకునే అవకాశం తదితర లాభాలు కలుగుతున్నాయి. అయితే రిమోట్ ఉద్యోగ శైలిలో ఉండే సమస్యలు దానికి ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఆఫీసు నుంచి పనిచేసే తోటి ఉద్యోగుల నుంచి వంచనకు గురవుతామనే ఆందోళన రిమోట్ వర్కర్స్‌లో ఎక్కువగా ఉందట.
ఈ ఆందోళన లేకపోవడం విషయంలో రిమోట్ వర్కర్స్ 6.69 స్కోర్ చేస్తే ఇతరులకు 7.75 వచ్చాయి. ఇదే కాకుండా తేలికగా వర్క్ నుంచి డైవర్ట్ అయ్యే అవకాశం, పనిపట్ల నిర్లక్ష్యం.. కంపెనీ సాఫ్ట్‌వేర్, డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదం వంటివి కూడా ఉన్నాయంటున్నారు. వర్క్‌ప్లేస్‌లు రోజురోజుకూ డిజిటలైజ్ అవుతున్న నేపథ్యంలో అరకొరగా మాత్రమే ఇప్పటిదాకా పరిచయమున్న వర్క్ ఫ్రం హోమ్/రిమోట్ వర్కింగ్ అనేది లాక్‌డౌన్ పుణ్యమాని అలవాటుగా మారిపోయింది. దీంతో రానున్న కాలంలో ఇల్లే ఆఫీసులుగా మారే ధోరణి మరింత బలపడటం ఖాయమని కార్పొరేట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment