తెలంగాణలోనూ సౌరకాంతులు!!
తెలంగాణ రాష్ట్రంలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు పుణెకు చెందిన ఎన్రిచ్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. 'సోలార్ పార్కు'లో భాగంగా ఈ ప్లాంటును ఏర్పాటుచేయడానికి అనుమతులు కూడా ఈ కంపెనీకి వచ్చాయి. ఇందుకోసం ఎన్రిచ్ ఎనర్జీ సంస్థకు 'లెటర్ ఆఫ్ ఇంటెంట్'ను ఏపీట్రాన్స్కో జారీచేసింది.
ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్తును కిలోవాట్ అవర్ (యూనిట్)కు రూ. 6.49 చొప్పున కొనుగోలు చేయడానికి పీపీఏ కూడా కుదిరింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి పరిశుద్ధమైన విద్యుత్తును అందించాలనే అక్కడ ప్లాంటును పెడుతున్నట్లు ఎన్రిచ్ ఎనర్జీ డైరెక్టర్ కంచల్ తెలిపారు. ఈ కంపెనీ ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 25, 50 మెగావాట్ల ప్రాజెక్టులను ఏర్పాటుచేస్తోంది.