జెడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సాక్షి ప్రతినిధి, వరంగల్: చిన్నారి శ్రీహితపై అత్యాచారం, హత్య సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ‘‘అసలు ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు.. ఆ కామాంధుడిని ఉరి తీయాలని ఉంది. కానీ అది సాధ్యమయ్యేది కాదు. చట్టాలున్నాయి.. వాటి ద్వారా ముందుకు పోదాం’’అని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో జరిగింది.
6 నెలల పసిపాప శ్రీహితను పాశవికంగా హత్య చేసిన నిందితుడికి త్వరగా శిక్ష పడేందుకు కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని కోరుతూ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే వరంగల్ రూరల్, అర్బన్ జిల్లా స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ చిన్నారి శ్రీహిత ఘటనను ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
పీఆర్ చట్టాన్ని పటిష్టం చేస్తున్నాం..
పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్టం చేస్తున్నామని, అధికారాలు, విధులు అప్పగించడంతో పాటు దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తీసుకునేలా రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. గ్రామపంచాయతీ పరిధిలోకి ఉపాధి హామీ పనులు తీసుకొచ్చేలా చట్టంలో మార్పు తీసుకువస్తున్నామని చెప్పారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు ఇక నుంచి పాఠశాలలు పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఇక నుంచి వ్యవసాయం, అంగన్‌వాడీతో పాటు ఇతర అంశాలను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురానున్నట్లు వివ రించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలు రెండు మూడు రోజుల్లో రానున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment