
'దగాపడ్డ రైతులను ఆదుకుంటే నష్టమేంటి?'
వరంగల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని టీటీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు.
హన్మకొండ: వరంగల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని టీటీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబలను ఆదుకోవాలని కోరుతూ వరంగల్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలతో కలిసి బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని, అలాంటిది దగాపడ్డ రైతుల కోసం రూ.50కోట్లు కేటాయిస్తే నష్టమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వ్యవసాయానికి 8 గంటల విద్యుత్ అందించాలని అన్నారు. పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌గా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల పిల్లలను ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో చదివించాలని అన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గరిక పాటి మోహన్‌రావు, గుండు సుధారాణి, నాయకులు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.