
ప్రశ్నించినందుకే సస్పెన్షన్
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణలో కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతులకు భరోసా కల్పించాలని తాము అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే టీటీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఎన్టీఆర్ సంక్షేమ నిధి నుంచి రూ.50వేల చొప్పున 74మందికి ఆర్థికసాయం చెక్కులు అందజేశారు. ఆదివారం పట్టణంలోని ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
రాష్ట్రంలో 400 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం తరఫున ఒక్క అధికారి గానీ, మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ పరామర్శించలేదని అన్నారు. జిల్లాలో 74మంది ఆత్మహత్య చేసుకుంటే జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కూడా పరామర్శించకపోవడం బాధాకరమని తెలిపారు. 25 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అధికారుల వద్ద రిపోర్టులు ఉన్నాయని తెలిపారు. రైతు కుటుంబాలకు భరోసా, మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో తమ పార్టీ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పత్తి పంటకు క్వింటాల్‌కు కనీసం రూ.5వేల మద్ధతు ధరతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వారం రోజుల్లో ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు సీసీఐ చైర్మన్‌ను రప్పించి వారికి మద్దతు ధర దక్కేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ జగన్మోహన్‌ను కలిసివినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పశ్చిమ, తూర్పు జిల్లా అధ్యక్షులు లోలం శ్యాంసుందర్, అరిగెల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు గోపినాథ్, ప్రకాష్‌గౌడ్, ఎన్నికల కన్వీనర్ పెద్దిరెడ్డి, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావ్, యూనుస్ అక్బానీ, రాజేశ్వర్, నైతం వినోద్, బీజేపీ నేత పాయల్ శంకర్ పాల్గొన్నారు.