'హైదరాబాదీనని కాలర్ ఎగరేసి చెప్పండి'
హైదరాబాద్:నగరంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఇకపై సెటిలర్స్ అనే పదాన్ని వాడొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నుంచి సెటిలర్స్ అనే పదానికి నగర ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ప్రాంతాలు, విభేదాలు మరచి హైదరాబాదీనని కాలర్ ఎగరేసి చెప్పాలని కేసీఆర్ సూచించారు. కేసీఆర్ విత్ యూ అనే విషయం మరచిపోవద్దని తెలిపారు. 2018 తర్వాత తెలంగాణలో పుట్టేవారికి విద్యుత్ కొరత అంటే తెలియదని.. వేసవిలో కరెంట్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర బడ్జెట్ బాగుండాలని తాను కోరుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు.
హుస్సేన్ సాగర్ పై ఆరోపణలు పనికి మాలినవన్నారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్ పై పునఃసమీక్ష చేస్తున్నామన్నారు. యాదగిరి గుట్టను అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేస్తామని కేసీఆర్ తెలిపారు. త్వరలో కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి సీఎంను కలిసి ఆల్మటి నుంచి నీటిని సాధించుకోస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛన్ అందజేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పష్టం చేశారు. మార్చి ఒకటవ తేదీ నుంచి ఆ పింఛన్ ను అందజేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మొత్తంగా ఉన్న బీడీ కార్మికులు నాలుగు లక్షల 90 వేల మంది ఉన్నారని.. అర్హులైన వారు ఎమ్మార్వో ఆఫీస్ నుంచి దరఖాస్తు పంపాలని ఆయన తెలిపారు.
దీనిపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... బీడీ కార్మికులు ఎవరూ అనవసర ఆందోళనకు గురి కావద్దని సూచించారు. తమ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.