రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ ఆకర్ష్ కొనసాగుతుండగా...
► కార్పొరేటర్లను బుజ్జగించిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
► తొమ్మిది మంది చేరికకు 27న ముహూర్తం?
గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ ఆకర్ష్ కొనసాగుతుండగా...కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్మథనం మొదలైంది. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఇన్నాళ్లుగా అభివృద్ధి పనులు చేసుకోలేనివిధంగా పరిస్థితి తయారైందునే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు తొమ్మిది మంది కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. వారిని బుజ్జగించే పనులు కూడా ఐదురోజులుగా సాగుతున్నాయి. మంగళవారం మంథనికి వచ్చిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సదరు కార్పొరేటర్లను, పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ముఖ్యనాయకులను పిలిపించుకుని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదని, పార్టీకి భవిష్యత్ ఉందని, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి న్యాయం జరుగుతుందని ఆయన వారికి సూచించారు.
అయితే అభివృద్ధి మంత్రం పేరుతో ఆకర్షించిన 9 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను ఈ నెల 27న టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు ముహూర్తం నిర్ణయించారు. నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, పార్టీ అధ్యక్షుడు దీటి బాలరాజు, ఎన్.మారుతి, గడ్డి కనకయ్య, చెరుకు బుచ్చిరెడ్డి మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు విషయం వివరించారు. ఈ నెల 27వ తేదీన తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరేలా ప్రణాళికలు రూపొందించారు. శ్రీధర్‌బాబు, వివేక్ మధ్య విబేధాలు కార్పొరేటర్లపై ప్రభావం చూపడంతోనే వారు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.