చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు
పెనుబల్లి: మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందారు. సుమారు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం పంచాయతీ పరిధిలోని నాయకులగూడెం సమీపంలో గల మొక్కజొన్న ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సత్తుపల్లికి చెందిన వ్యాపారి ఎలినేని మురళీకృష్ణ నాయకులగూడెంలో నెల రోజుల క్రితం మొక్కజొన్న ఫ్యాక్టరీని ప్రారంభించారు. మొక్కజొన్న కంకుల నుంచి విత్తనాలు వేరు చేసి.. బెండ్లను బాయిలర్‌లో వేడి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బాయిలర్ ద్వారా వచ్చిన ఆవిరితో విత్తనాలను శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి రవాణా చేస్తారు.
ఈ క్రమంలో బాయిలర్ వద్ద పీడనం పెరిగి భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందగా.. ఆరు నుంచి పది మంది వరకు తీవ్ర గాయాల య్యాయి. పేలుడు తీవ్రతకు కార్మికులు 10 నుంచి 20 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయారు. మృతదేహాలు మాత్రం భయానక పరిస్థితిలో పడి ఉన్నాయి. క్షతగాత్రులను సత్తుపల్లి, పెనుబల్లి ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా.. పేలుడు రాత్రి 7 గంటల సమయంలో చోటుచేసుకోగా.. అప్పటికే కొందరు కార్మికులు విధుల నుంచి ఇళ్లకు వెళ్లడంతో ప్రాణనష్టం సంభవించలేదు. పేలుడుతో ఫ్యాక్టరీలోని సగ భాగం, ప్రహరీ కూలిపోయింది. పరిసరాల్లోని కార్లు, లారీల అద్దాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎవరినీ గుర్తించలేని పరిస్థితి ఉంది. కాగా.. బిహార్‌కు చెందిన కార్మికులతోపాటు స్థానికులు ఇందులో పనిచేస్తున్నారు. మృతులు ఎవరనేది ఇంకా నిర్ధారించలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment